మందస: వంశధార నీటి సాధనకు పోరాటం ఒక్కటే మార్గమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. వంశధార నదీ జలాలను ఇచ్ఛాపురం వరకు పొడిగించాలని పలాస వంశధార జల సాధన కమిటీ ఆధ్వర్యంలో మార్పు మన్మధరావు అధ్యక్షతన మందస మండలం హరిపురం గ్రామంలో జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వంశధార నీరు ఇక్కడి వరకు వస్తే.. ఈ ప్రాంతంలో వలసలు ఉండవని, రైతుల జీవితాల్లో మార్పులు వస్తాయని తెలిపారు. అక్షల కోట్ల రూపాయలను పాలకులు వృధాగా అనేక కంపెనీలకు ఇస్తున్నారని, రైతులకు సహకారం ఇస్తే తప్పేంటని అన్నారు. ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసిన మందస గడ్డను స్ఫూర్తిగా తీసుకుని పోరా డాలని సూచించారు.
అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఏఎఫ్‌టీయూ జాతీయ ఉపాధ్యక్షులు పి.ప్రసాద్ మాట్లాడుతూ ఏడు దశాబ్దాలుగా ఈ ప్రాంతం వలసలకు నిలయంగా మారిందన్నారు. కార్యక్రమంలో హేమరావు చౌదరి, ధర్మార్పు వెంకటరావు, సోమ నాథం, నల్ల హడ్డి, వంకల మాధరావు, సన్నశెట్టి రాజశేఖర్, డాక్టర్ ఖగేశ్వరరావు, బాబూరావు మాస్టారు పాల్గొన్నారు.


