ఆమదాలవలస: మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని, ఆయనపై చేస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలు పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమేనని వైఎస్సార్ సీపీ యువ నాయకుడు తమ్మినేని చిరంజీవినాగ్ హెచ్చరించారు. ఆమదాలవలసలోని తన స్వగృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం–పాలకొండ ప్రధాన రహదారి పక్కన ఆమదాలవలస పట్టణ నడిబొడ్డున తమ కుటుంబం సుమారు 25 ఏళ్ల క్రితమే స్థిర నివాసం ఏర్పర్చుకుందన్నారు. అదే ప్రాంతంలో సుమారు 15 ఏళ్ల కిందట విద్యాసంస్థను స్థాపించినట్లు వివరించారు. తమ కళాశాల వెనుక భాగంలో సుమారు 40 సెంట్ల స్థలాన్ని తమ్మినేని సీతారాం చట్టబద్ధంగా కొనుగోలు చేశారని, ఆ స్థలంలోని కొంత భాగంలో కళాశాలకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. అయితే మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమికి సబ్ డివిజన్ జరగకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని, దీనిని ఆసరాగా చేసుకుని తమ కుటుంబంపై భూ ఆక్రమణ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు గతంలోనూ పలుమార్లు జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేశారని, సంబంధిత అధికారులు భూమి హద్దులు, భూ రికార్డులు, పత్రాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల జరుగుతున్న భూముల రీ–సర్వే ప్రక్రియలో తమకు సంబంధించిన భూమి హద్దులను అధికారులకు తెలియజేసేందుకు వెళ్లిన సమయంలో సబ్ డివిజన్ కాని మొత్తం భూమిపై కొందరు వ్యక్తులు హక్కులు ప్రకటిస్తూ వివాదానికి తెరలేపారని ఆరోపించారు. ఇదే సమయంలో కొందరు వ్యక్తిగత, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వివాదం రాజేశారని పేర్కొన్నారు. మీడియా ముసుగులో రాజకీయ కుట్రలకు పాల్పడుతున్న స్వార్థపరులకు తగిన సమయంలో తగిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నాయకుడు బగ్గు కుమార్ పాల్గొన్నారు.


