టెక్కలి: టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలో గల గోపినాథపురం గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువు అక్రమార్కుల పాలవుతోంది. ఇప్పటికే చెరువుకు ఆనుకుని వేసిన లేఅవుట్‌లతో ఒక వైపు నుంచి చెరువు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో తా జాగా గ్రామానికి ఆనుకుని ఉన్న భాగంలో కొంత మంది అక్రమ కట్టడాలు చేయడంపై ఎంపీటీసీ స భ్యురాలు సత్తారు ఉషారాణి అధికారులకు ఫిర్యాదు చేశారు. ధర్మనీలాపురం రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ చెరువు రెవెన్యూ రికార్డుల ప్రకారం సుమారు 6.62 ఎకరాల విస్తీర్ణం ఉండేది. ఈ చెరువు వ్యవసాయ ఆయుకట్టుతో పాటు పశువులకు నీటి ఆధారంగా ఉండేది. అయితే కాలక్రమేణా చెరువుకు ఆనుకుని లేఅవుట్‌లు వేయడంతో కొంత భాగం ఆక్రమణలకు గురైంది. ఇప్పుడు కొంత మంది వ్యక్తులు చెరువు గర్భంలో కట్టడాలు చేయడంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే అధికార యంత్రాంగం స్పందించి గోపీనాథపురం చెరువులో సర్వే నిర్వహించి హద్దులు కేటాయించాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలి
గోపీనాథపురం చెరువులో ఇటీవల కాలంలో కొంత మంది వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం చెరువు గర్భాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాం. గ్రామస్తులకు, రైతులకు ఆధారంగా ఉన్న ఈ చెరువును కాపాడేలా అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలి. – సత్తారు ఉషారాణి, ఎంపీటీసీ సభ్యురాలు, గోపీనాథపురం


