పలాస: పలాస కిడ్నీ ఆస్పత్రిలో మంగళవారం ఒక ఇన్ షేషెంట్ వద్ద గల పర్సులో ఉన్న ఆమె బంగారం పుస్తెలతో పాటు రూ.3వేలు నగదును గుర్తుతెలియని వారు అపహరించుకుపోయారు. ఈ వా ర్త కాశీబుగ్గలో పెద్ద సంచలనమైంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పాతపట్నం మండలం తెంబూరు గ్రామానికి చెందిన చెల్లిబోయిన నారాయణమ్మ అనారోగ్యంతో కిడ్నీ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత గర్భసంచిలో సమస్య ఉందని తెలిపారు. గర్భసంచిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించాలని ఆమెకు వైద్యులు సూచించారు. ఆమె అందుకు అంగీకరించి ఆపరేషన్ చేయించుకున్నారు. ఐదు రోజుల కిందట ఆమెకు ఆపరేషన్ చేశారు. ఆమెకు ఒక ప్రత్యేక గది కూడా ఇచ్చారు. అయితే మంగళవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆమె కుమార్తె వి.రాజేశ్వరి సహకారంతో టాయిలెట్‌కు వెళ్లారు. అటు నుంచి వచ్చి తమ అవసరాల కోసం బ్యాగులో ఉంచిన పర్స్‌ను చూడ గా అందులో ఉన్న బంగారు పుస్తెలు, రూ.3వేలు నగదు కనిపించకపోవడంతో లబోదిబోమన్నారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయం ఆస్పత్రి సిబ్బందికి తెలియజేశారు. వారి నుంచి తగిన సమాధానం లేకపోవడంతో కాశీబుగ్గ పోలీ సులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ పోలీసులు కూడా తగిన విధంగా స్పందించలేదని, కనీసం ఆస్పత్రికి ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణమ్మ భర్త కూడా వారి ఇంటి వద్ద పెరాలసిస్ వ్యాధితో ఉంటున్నారని ఆమె కుమార్తె రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కాశీబుగ్గ సీఐ రామకృష్ణను వివరణ కోరగా వారు ఫిర్యాదు చేశారని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.


