నరసన్నపేట: ప్రముఖ వ్యాపార కేంద్రం నరసన్నపేటలో ఎక్కడ చూసినా అధికారులే కనిపిస్తున్నారు. జిల్లా స్థాయిలో వివిధ శాఖల అధికారులు పేటలోనే మకాం వేశారు. 20 మంది ఎంపీడీఓలు, 20 మంది డిప్యూటీ ఎంపీడీఓలు, 50 మంది పంచాయతీ కార్యదర్శులు, 10 మంది తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు, పంచాయతీ విభాగం అధికారులు, సిబ్బందిని వివిధ పనుల్లో నిమగ్నమయ్యారు. పంచాయతీలో ఉన్న 20 వార్డులకూ అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించారు. వీరికి సహాయకులుగా ఇద్దరేసి పంచాయతీ కార్యదర్శులను వేశారు. ప్రతివార్డులో 20 మంది చొప్పున పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. జిల్లా కేంద్రం తర్వాత నరసన్నపేట పెద్ద పట్టణమని, దీనిని స్వచ్ఛ నరసన్నపేటగా మార్చాలనేదే తమ ఉద్దేశమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెబుతున్నారు. ఈ మేరకు బుధవారం ఉదయానికే నరసన్నపేట చేరుకున్న కలెక్టర్ సత్యవరం కూడలి వద్ద చేపడుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పనుల సంగతి పక్కన పెడితే అధికారులు మాత్రం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఒక పని పూర్తయిన వెంటనే మరో పని అప్పగిస్తుండటంతో దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మరోవైపు ఎండ తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.


