శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ల్యాబ్ అటెండర్లు, గెస్ట్, పార్ట్‌టైమ్ టీచర్లను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి నిలుపుదల చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల కాంట్రాక్ట్–ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డి.గణేష్ అన్నా రు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏటా అంకితభావంతో పనిచేస్తున్న గురుకుల ఉద్యోగులను అకస్మాత్తుగా విధుల నుంచి తొలగించడం కార్మిక చట్టాలకు వ్యతిరేకమని ఆయన తెలిపారు. ఈ అన్యాయ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి 40 రోజుల సెలవుదినాల్లో కూడా జీతాలు చెల్లిస్తారని గుర్తు చేశారు. పూర్తికాల అధ్యాపకు ల లేమితో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయన్నారు. గురుకులాల్లో నాణ్యమైన విద్య అందించాలంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవా లని ఆయన డిమాండ్ చేశారు.
అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్ దండ శ్రీనివాస్ కుటుంబసమేతంగా శుక్రవా రం దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదా యం ప్రకారం అధికార సిబ్బంది, అర్చకులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఆలయ విశిష్టతను ప్రధానార్చకు లు ఇప్పిలి శంకరశర్మ ఆయనకు వివరించి స్వామి వారి శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, జూనియర్ అసిస్టెంట్ భాస్కర్ సాయి పాల్గొన్నారు.
అరసవల్లి: పంచాయతీరాజ్ శాఖతోనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగమైన గ్రామ సర్పంచ్‌గానే తన రాజకీయ జీవి తం ప్రారంభం కావడం నిజంగా తన అదృష్టమన్నారు. జెడ్పీ సీఈఓ ఆర్.వెంకట్‌రామన్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ప్రాముఖ్యతను వివరిస్తూ..73వ రాజ్యాంగ సవరణ విశేషాలను వివరించారు. అంతకుముందు జెడ్పీ సీఈఓ ఆర్.వెంకట్రామన్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా గాంధీజీ, బీఆర్ అంబేడ్కర్‌ల చిత్రపటాలకు ఇన్‌చార్జి మంత్రి శ్రీనివాస్, ఎమ్మెల్యే శంకర్ తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
స్టేజిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడా..?
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు మొదలవలస రమేష్ ఏకంగా వేదికపైన కూర్చోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత ఉండకూడదు. అయినప్పటికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు రమేష్‌ను ఏకంగా స్టేజిపై ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్యేల సరసన కూర్చోబెట్టడం చర్చకు దారితీసింది. సమావేశానికి హాజరైన అధికారులు దీనిపై తీవ్రంగా చర్చించుకున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో చూడలేదని వాపోతున్నారు.


