మెళియాపుట్టి: గ్రానైట్ క్వారీలు ప్రమాదాలకు నిలయాలుగా మారా యి. ఎక్కడి నుంచో పొట్టకూటికి వచ్చిన వ్యక్తులు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. మెళియాపుట్టి ఎస్‌ఐ మహమ్మద్ అమీర్ అలీ తెలిపిన వివరాల మేరకు.. శుక్ర వారం వేకువజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లోని (గంగరాజపురం దరి) రాజయోగ క్వారీలో పనిచేస్తున్న ధర్మారామ్ జాట్ (34) మృతి చెందాడు. రాయి కోస్తుండగా రోప్ వైర్ తెగిపోడంతో ఇనుప చువ్వ మెడకు లోతుగా గుచ్చుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావం జరగడంతో వెంటనే టెక్కలి ఆస్పత్రికి తరలించారు. అక్కడకు తీసుకెళ్లే సరికే ఆయన మృతి చెందారు. ఈయనది రాజస్థాన్‌లోని నాగవూర్ జిల్లా, భిల్లూ గ్రామం. ఇంకా వివాహం కాలేదు. తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నారు. విషయం తెలుసుకున్న తమ్ముడు బయల్దేరి మెళియాపుట్టి వస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. గ్రానైట్ క్వారీలో అర్ధరాత్రి వేళ పనులు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే క్వారీలో గతంలో అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.


