శ్రీకాకుళం క్రైమ్/టెక్కలి: జిల్లాలోని కోటబొమ్మాళి ప్రాంతంలో శుక్రవారం జరిగిన క్రికెట్ మ్యాచ్ అటు పోలీసులను, ఇటు తల్లిదండ్రులను ఉలికిపాటుకు గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం గాజులవీధికి చెందిన పందిరి అరుణ భర్త చనిపోవడంతో ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తోంది. వీరిలో చిన్నవాడైన రోహిత్ అమ్మమ్మగారి ఊరు పెద్దసాన ఇటీవల వెళ్లాడు. శుక్రవారం అదే గ్రామస్తులతో కలిసి కోటబొమ్మాళి ప్రాంతంలో అక్కడివారితో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఒక యువకుని తలకు బాల్ తగిలి గాయమైనట్లు కుమారుడు రోహిత్ ఫోన్ చేశాడని అరుణ చెప్పారు. అనంతరం దగ్గరలో ఆస్పత్రికి తీసుకెళ్లారని, పోలీసులు తమను తీసుకెళ్తునట్లు మధ్యాహ్నం 12:30కు రోహిత్ ఫోన్‌చేసి చెప్పాడు. అయితే ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయలేదని పేర్కొంది. టూ టౌన్ పీఎస్ నుంచి ఫోన్ వస్తుందని కుమారుడు చెప్పడంతో అక్కడికి సైతం తాను వెళ్లానని పేర్కొంది. మళ్లీ సాయంత్రం తనతో పాటు అందరి ఫోన్లు పోలీసులు లాక్కున్నారని, వేరే వారి వద్ద ఫోన్ తీసుకున్న తన కుమారుడు మళ్లీ చేశాడని అరుణ చెప్పారు. విషయం ఇటు టెక్కలి, కోటబొమ్మాళి పోలీసులకే కాక శ్రీకాకుళం టూటౌన్ పోలీసులకు కూడా తెలియడం, అప్పటికే కొంతమంది సీఐడీ పేరిట పోలీసులకు ఫోన్లు చేసి ఆ పిల్లలు ఏమయ్యారని వాకబు చేయడం అంతా చర్చకు దారి తీసింది. చివరికి రాత్రి 9.35 గంటలకు కుమారుడు రోహిత్ ఫోన్ చేసి తనని పోలీసులు విడిచిపెట్టినట్లు, క్షేమంగా అమ్మమ్మగారింటికి వెళ్తున్నట్లు చెప్పాడని ఆమె తెలిపారు. కాగా రోహిత్ తనను, మిగతావారిని పోలీసులు ఎక్కడికి పట్టుకెళ్లారన్నది చెప్పకపోవడంతో మిస్టరీగానే మిగిలింది.


