వజ్రపుకొత్తూరు రూరల్: ఏళ్ల తరబడి ఉన్నటువంటి భూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. మండలంలోని ఎయిర్‌పోర్టు నిర్వాసిత గ్రామాలైన అనకాపల్లి, ఒంకులూరు, మోట్టూరు గ్రామాల్లో శుక్రవారం రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి వారితో మాట్లాడారు. గతంలో గ్రామాల్లో చేసిన రీసర్వేలో తప్పులు ఉన్నాయని, ఈ విషయాన్ని అనేక సార్లు రెవెన్యూ అధికారులకు చెప్పినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే భూ సమస్యల పరిష్కారానికి ఇంటింటి సర్వే చేపట్టేందుకు ఇప్పటికే గ్రామాల్లో 10 మంది వీఆర్వోలను రైతులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే ఎయిర్‌పోర్టు నిర్మాణంపై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో స్థానిక తహసీల్దార్ డీవీ సీతారామయ్య, పాతపట్నం తహసీల్దార్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.


