● బారువ తీరం అభివృద్ధి కలేనా..?
● ఏడాది గడిచినా మాటలకే పరిమితమైన అభివృద్ధి
● పనులు ఎప్పుడని ప్రశ్నిస్తున్న స్థానికులు
● హామీలు విని
వచ్చి పోయే నౌకలు, రంగూన్‌కు విరివిగా ప్రయాణాలు, పీచు వస్తువుల ఎగుమతులు, దండిగా వ్యాపారాలు.. స్వాతంత్య్రానికి పూర్వం బారువ తీర వైభవం ఇది. మరి ఇప్పుడో.. మునిగిపోయిన ఓడను చూపించి అభివృద్ధి చేస్తామనే హామీలు, బెంచీలు లేని తీరాన్ని చూపించి మినీ గోవా చేస్తామనే గొప్పలు, రెండు రోజులు పండగలు నిర్వహించి ఏళ్లకు ఏళ్లు మాట మర్చిపోయే వైనాలు. బారువ తీరం హామీలు వినీవినీ అలసిపోయింది. మాటలు తప్ప పనులు లేకపోవడంతో నానాటికీ తీసికట్టుగా మారుతోంది.
సోంపేట: జిల్లాలో పొడవాటి తీర ప్రాంతం ఉండి, అభివృద్ధికి అన్ని విధాలా అర్హతలు ఉన్నా బారువ వెనుకబడిపోతోంది. పాలకులు కేవలం హామీలకు మాత్రమే పరిమితం అవుతుండడంతో తీరం అధ్వానంగా మారుతోంది. ఒకప్పుడు బారువ తీరం రాష్ట్రంలో పేరున్న పర్యాటక ప్రదేశం. స్వాతంత్య్రం రాక మునుపు బారువ ఓడ రేవుగా ప్రసిద్ధి చెందింది. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించడం, వస్తువులు రవాణా జరిగేవి.
చిల్కా మునకతో..
సుమారు 107 ఏళ్ల కిందట 1917 లో బారువ తీరంలో చిల్కా ఓడ మునిగి పోయింది. ఒడిశా, ఆంధ్రా ప్రాంతాల నుంచి ప్రజలు ఉపాధి కోసం రంగూన్ వెళ్లేవారు. ఈ ప్రాంతంలో తయారయ్యే పీచు, పీచు వస్తువులు, రవాణా చేసేవారు. మద్రాసు నుంచి సుమారు 1700 మంది ప్రయాణికులు, వివిధ వస్తువులతో కూడిన చిల్కా ఓడ బారువ తీరానికి చేరుకుని ఇక్కడి నుంచి గోపాలపూర్ వెళ్లే క్రమంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 80 మంది వరకు మృతి చెందారని, మిగిలిన వారిని కాపాడారని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఓడ గుర్తుగా ఓ పొగ గొట్టం కనిపిస్తూ ఉంటుంది.
అన్ని అవకాశాలు ఉన్నా..
బారువ తీరానికి సుమారు 200 మీటర్ల దూరంలో, సుమారు ఎనిమిది మీటర్ల లోతులో చిల్కా నౌక ఓడ శిథిలాలు ఉన్నాయి. స్కూబా డైవింగ్ శిక్షణతో పర్యాటకులను ఓడ వద్దకు తీసుకువెళ్లే అవకాశం ఉందని గతంలో ఫెస్టివల్‌కు వచ్చిన స్కూబా డైవర్లు తెలిపారు. ఇది మొదలైతే అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంటుంది. పర్యాటక శాఖ దీనిపై దృష్టి పెడితే బారువ తీరం అభివృద్ధి చెందుతుంది.
బోటు షికారు..
మహేంద్ర తనయ నదీ సంగమం బారువ తీరంలోనే ఉంది. నదీ సంగమం కలిసే ప్రాంతం నుంచి టి.శాసనాం గ్రామం వరకు బోటుషికారు చేసే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అలాగే పొడవాటి తీరంలో చిన్న పిల్లలు ఆడుకోవడానికి పరికరాలు, చిన్న క్రీడా మైదానాలు, మౌలిక వసతులు కల్పిస్తే రిషికొండకు ధీటుగా బారువ తీరం ఉంటుందని స్థానికులు తెలియజేస్తున్నారు. బీచ్ ఫెస్టివల్ హంగామా తప్పితే ఇక్కడ వాస్తవంగా జరిగిన పనులేవీ లేవని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బారువ తీరంలో గత ఏడాది బీచ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఈ తీరాన్ని మినీ గోవాగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు హామీలు గుప్పించారు. ఆ మాటలు నీటి మూటలుగానే మిగిలాయని స్థానికులు చెబుతున్నారు. ఫెస్టివల్ సమయంలో పర్యాటకులు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన గుడారాలు పూర్తిగా పాడైపోయాయి. తూతూమంత్రంగా వేసిన విద్యుద్దీపాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.
బీచ్ అభివృద్ధి చేయాలి
బారువ బీచ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. రిసోర్స్ ఉన్నా పర్యాటకంగా అభివృద్ధి లేకపోవడంతో పర్యాటకుల సందడి తక్కువగా ఉంది. పొడవాటి తీరాన్ని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయి.
– కర్రి సత్యం, బారువ
హామీలకే పరిమితం
ఫెస్టివల్ పేరిట హంగామా తప్ప అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇచ్చిన హామీ ప్రకారం బారువ తీరాన్ని అభివృద్ధి చేయడానికి పాలకులు ముందుకు రావాలి.
– గురాల శ్రీను, వైస్‌ఎంపీపీ, బారువ


