టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిప్లమో, డిగ్రీ, ఐటీఐలలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కోసం జేకేసీ, సీఎంఎస్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తున్న ఈ జాబ్‌మేళాలో యమ హా మ్యూజిక్, టాటా ఎలక్ట్రానిక్స్, అట్లాస్ గ్రూప్, అపోలో టైర్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో పాటు లీ ఫార్మా, జెన్‌ఫోల్డ్ సస్టెయిన్‌బుల్ టెక్నాలజీస్ భీమా ఫైన్ కెమికల్స్ తదితర కంపెనీలు హాజరవుతున్నట్లు ప్రిన్సిపాల్ గోవిందమ్మ పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో నేరుగా హాజరు కావాలని కోరారు.
26న లా ఎంట్రన్స్ మోడల్ టెస్ట్
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లా బీసీ న్యాయవాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన లా ప్రవేశ పరీక్షకు సంబంధించిన మోడల్ పరీక్షను నిర్వహిస్తున్నట్టు బీసీ న్యాయవాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఆగూరు ఉమామహేశ్వరరావు తెలిపారు. బీసీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈ మోడ ల్ ఎంపీఆర్ లా కాలేజీలో జరగనుందని ఆయన తెలిపారు. ఈ మోడల్ పరీక్షకి ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు వారి పేర్లను రిజిస్ట్రేష న్ చేయించుకున్నారని, ఇంకా ఆసక్తి గల వారు వారి పేర్లను 9440193228, 9440436496 నంబర్లకు ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పరీక్ష పూర్తిగా ఉచితమని తెలిపారు. ఈనెల 26వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నగరంలోని ఎంపీఆర్ న్యాయ కళాశాలలో ఈ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.
టీచర్‌కు సన్మానం
మందస: కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్న గంట గోపాలకృష్ణకు 4వ, 5వ తరగతుల పరిసరాల విజ్ఞానం పుస్తక రచనలో అవకాశం దక్కడం గొప్ప విషయమని స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూన వేణుగోపాలరావు అన్నారు. మంగళగిరిలోని విధ్యాభవన్‌లో రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ పుస్తక రచనలో భాగంగా ప్రస్తుతం ఆయన నాలుగు వర్క్ షాప్‌లలో పాల్గొని, కొత్తపల్లి పాఠశాల కీర్తి పతాకాన్ని రాష్ట్రస్ధాయిలో ఎగురవేయడంపై స్థానిక పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, కొత్తపల్లి గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. పుస్తక రచన కోసం ఈ జిల్లా నుంచి ఆయన మాత్రమే ఎంపిక కావడం విశేషం. గురువారం పాఠశాలకు చివరి రోజు కావడంతో ఆయనను సత్కరించారు.
ప్రశాంతంగా ఏపీ ఈ సెట్
నరసన్నపేట: స్థానిక కోర్ టెక్నాలజీలో గురువారం ఏపీ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసింది. రెండు కేంద్రాల్లో 350 మందికి 8 మంది గైర్హాజరయ్యారు. పాలిటెక్నిక్‌లో డిప్లమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్‌లో నేరుగా ప్రవేశాలకు ఏపీ ఈసెట్ ను ప్రభుత్వం నిర్వహించింది. డిప్లమా విద్యార్థులతో కోర్ టెక్నాలజీ వద్ద సందడి నెలకొంది.
‘ఉత్తరాంధ్ర జానపద కళలను పరిరక్షించాలి’
పలాస: ఉత్తరాంధ్ర జానపద కళలను పరిరక్షించాలని జానపద కళల పరిశోధకులు బద్రి కూర్మారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత రెండు రోజులుగా పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉత్తరాంధ్ర జానపద కళలు, సాహిత్యం అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఉత్తరాంధ్రలో ప్రాచీన కళలు గా తప్పెటగుళ్లు కళాకారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో రంగం ప్రజా సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు రంగం రాజేష్, సినీ నటుడు డాక్టర్ కుమార్ నాయక్, రంగం జిల్లా అధ్యక్షుడు కొర్రాయి శ్రీకాంత్, ఎల్‌వీ చలం, రంగం రాష్ట్ర సహాయక కార్యదర్శి హేమసోధన్ తో పాటు అనంత కరుణాకర్, గండ్రేటి శ్రీనివాస్ పాల్గొన్నారు.


