● అమ్మో.. నిమ్మ | - | Sakshi
Sakshi News home page

● అమ్మో.. నిమ్మ

Apr 24 2026 6:08 AM | Updated on Apr 24 2026 6:08 AM

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరిందని, శుక్రవారం జిల్లాలోని 12 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హెచ్చరించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం కొత్తూరు మండలంలో అత్యధికంగా 45.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైన ట్లు వెల్లడించారు. జిల్లాలోని 10 మండలాల్లో తీవ్ర వడగాలులు, 6 మండలాల్లో వడగాలులు వీచాయని పేర్కొన్నారు. ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, కంచిలి, కొత్తూరు, లక్ష్మీనర్సు పేట, మందస, నందిగాం, పాతప ట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాలులు వీస్తాయని, గంగువారి సిగడాం, మెళియాపుట్టి మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని కలెక్టర్‌ తెలిపారు. ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేసవి సెలవుల దృష్ట్యా ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ పాఠశాలలు ఎలాంటి తరగతులు గానీ, శిక్షణ తరగతులు గానీ నిర్వహించరాదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలను కాలువలు, చెరువులు, నదుల వద్దకు పంపవద్దని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ వాడాలి. తగినంత నీరు, పానీయాలు తీసుకోవాలి. పిల్లలు ఎండలో ఆడకుండా చూడాలి. హీట్‌ స్ట్రోక్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రహదారి భద్రతా నిబంధనలు పాటించాలి. సెలవుల్లో పిల్లలు నిర్మాణా త్మకమైన, విద్యా సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

జిల్లాలో నిమ్మకాయలు, టమాట ధరలు భారీగా పెరిగాయి. 45 రోజుల కిందట కిలో నిమ్మకాయల ధర హోల్‌సేల్‌లో రూ.25 నుంచి రూ.30 ఉండేది. రిటైల్‌లో రూ.40 నుంచి రూ.45 వరకు విక్రయించేవారు. ఇప్పుడిది హోల్‌సేల్‌లో రూ.140, రిటైల్‌లో రూ.150కు అమ్ముతున్నారు. వేసవిలో నిమ్మకాయల ధర పెరగడం పరిపాటే అయినా ఏప్రిల్‌లోనే ఇంత ధర ఎన్నడూ లేదు. పైగా పెద్ద సైజు నిమ్మకాలు రూ.180 వరకు వెళ్తున్నాయి. అలాగే టమాట ధర కూడా కిలో రూ.25 నుంచి రూ.30 కు చేరుకుంది. ధరలు ఇలా పెరుగుతున్నా అధికారులు వాటిని నియంత్రించేలా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. –శ్రీకాకుళం

Advertisement
 
Advertisement
Advertisement