కొరత వాస్తవమే..
హిరమండలం:
వ్యవసాయ అనుబంధ శాఖల్లో జలవనరుల శాఖ కీలకమైనది. సాగునీటి ప్రాజెక్టులు, కాలువ లు, చెరువులు, సాగునీటి వనరులకు సంబంధించి పనులతో పాటు మరమ్మతులను పర్యవేక్షించేది ఆ శాఖే. ఇటువంటి శాఖలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. ప్రధానంగా వంశధార ప్రాజెక్టు పరిధిలో ఇంజినీర్ల కొరత అధికంగా ఉంది. దీంతో పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. రెగ్యులర్ సిబ్బంది లేకపోవడం, ఆపై వంశధార ప్రాజెక్టుతో పాటు ఇన్వెస్టిగేషన్ విభాగాల్లో అవసరానికి సరిపడా ఉద్యోగులు లేక డిప్యుటేషన్లు నడుస్తున్నాయి. ఒక్కో అధికారి రెండు, మూడు బాధ్యతలను చూడాల్సి వస్తోంది. ఫలితంగా పర్యవేక్షణ లేక పనులపై ప్రభావం పడుతోంది.
జిల్లాలో జలవనరుల శాఖలో కీలకమైన వంశధార ప్రాజెక్టు పరిధిలో సర్కిల్, హిరమండలం, ఆమదాలవలస–1, 2, నరసన్నపేట, టెక్కలి సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 71 మంది ఇంజినీర్లు ఉంటేనే పూర్తిస్థాయిలో సేవలందుతాయి. ప్రస్తుతం 43 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 28 పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. చివర కు వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ఎస్‌ఈ పోస్టులో పూర్తిస్థాయి అధికారి నియామకం కావడం లేదు. చివరకు ఎస్‌ఈగా ఈఈనే అదనపు బాధ్యత లు నిర్వర్తిస్తున్నారు. డిప్యూటీ ఎస్‌ఈ పోస్టు ఏడాది కాలంగా ఖాళీగానే ఉంది. ఆరుగురు ఈఈలు పని చేయాల్సిన చోట ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆమదాలవలస 1వ డివిజనల్‌లో ముగ్గురు, ఇన్వెస్టిగేషన్ లో ఒకరు, హిరమండలం కన్‌స్ట్రక్షన్ డివిజన్‌లో 11, మైక్రో ఇరిగేషన్ డివిజన్‌కు సంబంధించి నరసన్నపేటలో 8, టెక్కలిలో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జలవనరుల శాఖ పర్యవేక్షణ జిల్లా స్థాయిలో ఎస్‌ఈ బాధ్యత వహిస్తారు. అటువంటి పోస్టులో ఈఈ అదనపు బాధ్యతలు తీసుకొని రెండేళ్లవుతోంది. మధ్యలో ఒక అధికారిని ప్రభుత్వం నియమించింది. సదరు అధికారి రాయలసీమ వైపు వెళ్లిపోయారు. ప్రస్తుతం వంశధార పరిధిలో ఇద్దరు ఈఈ లు, ఇన్వెస్టిగేషన్ విభాగంలో ఒక్క ఈఈ మాత్రమే ఉన్నారు. 13 ఏఈ పోస్టులను సైతం భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే భూగర్భ జలాల సంరక్షణకుగాను ప్రతి నియోజకవర్గంలో జలధార–జలహారతి కింద ప్రభుత్వం కోటి రూపాయలతో పనులు చేయిస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లో గ్రోయిన్ల నిర్మాణం చేపడుతోంది. గొట్టా బ్యారేజీ దిగువ పొర్లు ప్రాంతంలో పనులు చేపడుతున్నారు. వీటన్నింటికీ పర్యవేక్షించి పనులు చేయించే ఇంజినీర్లు కావాలి. ఎంబుక్ వివరాలు, బిల్లుల నమోదుకు ప్రస్తుత సిబ్బందిపై భారం పడుతోంది. ఇప్పటికై నా జల వనరుల శాఖలో పూర్తిస్థాయిలో ఇంజినీర్లతో పాటు సిబ్బందిని నియమించాలని పలువురు కోరుతున్నారు.
జిల్లాలో ఇంజినీర్ల కొరత వాస్తవమే. కానీ వంశధార ప్రాజెక్టు పరిధిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు చేయిస్తున్నాం. సిబ్బంది కొర త అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సిబ్బంది తక్కువగా ఉన్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.
– జి.రామచంద్రరావు, ఇన్‌చార్జి ఎస్‌ఈ,
వంశధార ప్రాజెక్టు


