● ఆన్‌లైన్‌లో స్వయంగా వివరాల నమోదు ● ఈ నెల 30 వరకు అవకాశం ● మే 1 నుంచి సిబ్బందితో గణన ప్రక్రియ
హిరమండలం: జనగణన ప్రక్రియలో భాగంగా స్వీయగణన ప్రారంభమైందని హిరమండలం, ఎల్‌ఎన్‌పేట ఎంపీడీఓలు ఆర్.కాళీప్రసాద్, శ్రీనివాసరావు తెలిపారు. ప్రతిఒక్కరూ తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
మొబైల్‌లో ఇలా..
మనం ఇంట్లో కూర్చుని వివరాలను నమోదు చేసుకునేందుకు డిజిటల్ ప్రక్రియ ప్రాంభించారు. దీనిలో భా గంగా మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయి నుంచి ఉన్నతాధికారులు, కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వారి వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
●ముందుగా ‘ఎస్‌ఈ.సీఈఎన్‌ఎస్‌యూఎస్.జీఓవీ.ఐఎన్’ ఆన్‌లైన్ పోర్టల్‌లోకి వెళ్లాలి. రాష్ట్రం ఎంచుకున్నాక క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి.
●ముందుగాఇంటి యజమాని పేరునమోదు చేయాలి.
●ఇంట్లో ఎన్ని మొబైల్ నెంబర్లు ఉంటే అన్నీ ఇవ్వకూడదు. ఒక కుటుంబానికి ఒక మొబైల్ నంబర్ మాత్రమే ఇచ్చి నమోదు చేయాల్సి ఉంటుంది.
●మనకు నచ్చిన భాషను ఎంచుకోవాలి
●మనం ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.
●జిల్లా, గ్రామం, పిన్‌కోడ్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. ఈ నమోదులో మన ఇల్లు లొకేషన్ వచ్చేలా రెడ్‌మార్కుతో గుర్తించాల్సి ఉంటుంది.
●ఇళ్ల జాబితా ప్రశ్నలన్నింటినీ పూర్తి చేశాక వివరాలు సరిచూసుకోవాలి.
●అన్నీ సరిగ్గానే ఉన్నట్లు భావిస్తే సబ్‌మిట్ చేయాలి. తర్వాత 11 అంకెలు కలిగిన ఎస్‌ఈ ఐడీ జనరేట్ అవుతుంది.
●గణాంక సిబ్బంది (ఎన్యూమరేటర్లు) మే 1 తర్వాత మన ఇంటికి వచ్చినప్పుడు ఎస్‌ఈ ఐడీ నంబర్ చూపించాల్సి ఉంటుంది. వారు మనకు వచ్చిన ఐడీ నమోదు చేసినప్పుడు మనం ఇచ్చిన డేటా మ్యాచ్ అయితే జనగణన పూర్తయినట్లే.


