శ్రీకాకుళం న్యూకాలనీ: యువ క్రికెటర్లు, పాఠశాల స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఫోకస్ క్రికెట్ లీగ్ సీజన్–2 పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీ ఘనంగా ముగిసింది. జిల్లా క్రికెట్ సంఘం(జెడ్‌సీఏ) పర్యవేక్షణలో రెండు నెలలపాటు 16 ఏళ్లలోపు క్రీడాకారులకు కళింగపట్నం క్రికెట్ మైదానంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ జిల్లా క్రికెట్ సంఘం చీఫ్ సెలెక్టర్ కొట్టిస కిరణ్ సారధ్యంలో జరిగింది. లీగ్ కమ్ నాకౌట్ విధానంలో జరిగిన ఈ టోర్నీలో 20 జట్లు ప్రాతినిధ్యం వహించాయి. గురువారం కళింగపట్నం వేదికగా జరిగిన ఫైనల్ పోరులో ఐసీసీ ఇచ్ఛాపురం, ఆర్‌డీసీఏ విశాఖపట్నం తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌కు దిగిన విశాఖపట్నం నిర్ణీత 20 ఓవర్లలో 197 పరుగులు చేయగా, తదుపరి బ్యాటింగ్ చేసిన ఇచ్ఛాపురం జట్టు 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆర్‌డీసీఏ విశాఖపట్నం జట్టు ఎఫ్‌సీఎల్–2 టైటి ల్ దక్కించుకుంది. ముగింపు కార్యక్రమానికి జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి హసన్‌రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా క్రికెటర్లను ప్రోత్సహించేందుకు మరిన్ని టోర్నీలు నిర్వహిస్తామన్నారు. త్వరలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాల నిర్వహనకు సంబంధించి వివరాలు వెల్లడిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం కోశాధికారి మదీనా శైలాని, కౌన్సిల్ మెంబర్ డాక్టర్ సువ్వారి రవికుమార్, సీనియర్ క్రికెటర్ జీపీ నాయుడు, చీఫ్ కోచ్ కె.సుదర్శన్, కోచ్‌లు ఎం.ఆనంద్, హారిక యాదవ్, రాజా, సీనియర్ క్రీడాకారు లు పాల్గొన్నారు.


