కొబ్బరికి
తెగులు..
ఏం చేయాలో తెలీడం లేదు
ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి, ఎంతో కష్టపడి పెంచుతున్న కొబ్బరి మొక్కలు పెరిగి కాయలు కాస్తున్న సమయంలో పురుగు పోటుకి గురవుతున్నాయి. కళ్ల ముందే చెట్లు కుళ్లిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మాకు సలహాలు, సూచనలు చెప్పేవారు కరువయ్యారు.
– బి.షణ్ముఖరావు, యువ రైతు, పెద్దబొడ్డపాడు, వజ్రపుకొత్తూరు మండలం
అడవి పందులు ధ్వంసం చేస్తున్నాయి
కొబ్బరి పంటకు ఒక వైపు తెగుళ్లు, పురుగులు సోకుతుండగా మరో వైపు అడవిపందులు సైతం కొబ్బరి చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. కొబ్బరి మొక్కలు నాటి వాటికి రక్షణగా కంచె ఏర్పాటు చేసినప్పటికి ప్రయోజనం లేదు. ఎన్నో ఆశతో కొబ్బరి మొక్కలను నాటుతుంటే వీటి బెడదతో పంటలు నాశనం అవుతున్నాయి. – టి.కృష్ణారావు, రైతు, సీతాపురం, వజ్రపుకొత్తూరు మండలం.
అవగాహనతోనే అధిక దిగుబడి
ఉద్యాన పంటలపై రైతులకు ఆసక్తితో పాటు అవగాహన కూడా అవసరం. ఇప్పటికే జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే యాజమాన్య పద్ధతులు పాటించాలి. కొబ్బరి రైతు, కూలీ ల ప్రయోజనం కోసం కీర సురక్ష పథకం ద్వారా కేవలం రూ.143ల ప్రీమియంతో రూ. 7లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. రైతు సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
– సీహెచ్ శంకర్ దాస్,
డివిజన్ ఉద్యాన శాఖాధికారి,
వజ్రపుకొత్తూరు రూరల్:
ఉద్దాన ప్రాంత పెద్ద కొడుకుగా పేరు పొందిన కొబ్బరికి ఆపద వచ్చింది. కొబ్బరి పంటకు ఒక వైపు అడవి పందులు, మరో వైపు తెగుళ్లు సోకి ఉద్యాన రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేలాది రూపాయలు ఖర్చుపెట్టి కొబ్బరి మొక్కలను కొనుగోలు చేసి నాటితే మొక్కలు కాపు వచ్చి పంట చేతికి అందుతున్న తరుణంలో కొమ్మ పురు గు, ఎర్రముక్కు పురుగులు ఆశిస్తూ కొబ్బరి మొక్కలను తొలిచేస్తున్నాయి. దీంతో చెట్లు కుళ్లిపోతూ నేల కూలిపోతున్నాయి. అలాగే వజ్రపుకొత్తూరు మండలంలో గల సీతాపురం, పెద్దబొడ్డపాడు, బెండి, కొండవూరు తదితర గ్రామాల్లో అడవి పందులు స్వైర విహారం చేస్తూ కొబ్బరి కందను తినేందుకు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. కాగా జిల్లా వ్యాప్తంగా 41661.27 ఎకరాల్లో కొబ్బరి పంట సాగవుతోంది.
ఉద్దానం ప్రాంతంలో ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 28,389 ఎకరాల్లో సాగవుతుంది. అలాగే రణస్థలం మండలంలో 8803.70 ఎకరాల్లో రైతులు సాగు చేస్తుండగా మిగిలిన పంట ఇతర మండలాల్లో సాగు అవుతుంది. ఇతర పంటలకు భిన్నంగా కొబ్బరి పంట ఏడాది పొడవునా రైతులకు ఆదాయం తెచ్చిపెడుతుంది. దీంతో రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రైతు ఆశలను ఎర్రముక్కు పురుగులు నమిలి పిప్పి చేస్తున్నాయి. దీంతో ఎదుగుతున్న కొబ్బరి మొక్కలు నాశనమైపోతున్నాయి.
చెట్టును తొలుస్తున్న ఎర్రముక్కు పురుగు
5–10 ఏళ్ల వయస్సు కలిగిన కొబ్బరి మొక్కలను ఈ పురుగు ఆశిస్తుంది. ప్రధానంగా తోటలో మొవ్వుకుళ్లు లేదా పిడుగు పాటుతో చనిపోయిన చెట్లు గానీ మొవ్వులో కొమ్మకు పురుగు ఆశించిన చెట్లు తోటలో ఈ ఎర్రముక్కు పురుగులు ఆకర్షిస్తాయి. అలాగే తోటను ట్రాక్టర్ ద్వారా దున్నే సమయంలో గాని పనులు చేస్తున్న సమయంలో గానీ చెట్లు కాండంపై గాయాలు అయితే ఈ పురుగులు ఆశిస్తాయి.
లక్షణాలు
● మధ్య వలయంలో ఆకులు పసుపు రంగులో మారుతాయి. లేదా ఎండిపోతాయి.
● కాండంపై రంధ్రాల ద్వారా చిక్కని ముదురు ఎరుపు రంగు జిగురు కారుతుంది. రంధ్రం నుంచి నమిలిన పిప్పి వెలుపలికి వస్తుంది.
● కమ్మ మొదలు వద్ద నిలువుగా చీలుతుంది.
● పీచుతో పురుగు కట్టిన ఉండలు లేక నమిలిన పిప్పి ఆకు వలయాలలో లేక చెట్టు మొదలు వద్ద కనిపిస్తాయి.
● పురుగు ఆశించిన చెట్టు కాండముపై చెవి ఆన్చితే లోపల లద్దె పురుగులు కాండంను తినే శబ్దం వినిపిస్తుంది.
కొబ్బరి చెట్టుకి
ఆశించిన ఎర్రముక్కు పురుగులు
యాజమాన్య పద్ధతులు
ఈ పురుగు ఆశించి చనిపోయిన చెట్టు మానులను వెంటనే తొలగించాలి. లేదా చీల్చి తగలబెట్టాలి.
తోటలో కొమ్మ పురుగు ఆశించిన మొవ్వుల నుంచి పురుగును తొలిగించి 100 గ్రాముల వేపపిండి, 150 గ్రాముల ఇసుక కలిపి మిశ్రమాన్ని ఆ రంధ్రాల్లో పెట్టాలి.
సకాలంలో ఈ పురుగును గమనించి 10 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాన్, 10 మిల్లీలీటర్ల నీటిలో కలిపి వేరు ద్వారా మందు ఎక్కించాలి. మందు వేసిన 45 రోజుల వరకు కొబ్బరి కాయలు వినియోగించరాదు.
ఎర్రముక్కు పురుగు గుంపుగా ఆకర్షించు కృత్రిమ ఎరను బకెట్‌లో ఉంచి కొబ్బరి కాండానికి 1.50 మీటర్ల ఎత్తులో అమర్చిన,ఎర్రముక్కు తల్లి పురుగులు ఆకర్షితమై బకెట్ లోపల గల విష ఆహారంలో పడి చనిపోతాయి.
సగం డొల్ల అయిన కాండంలోని చెత్త,కుళ్లు పదార్థాన్ని శుభ్రం చేసి సిమెంట్, రాళ్లు, ఇసుక మిశ్రమంతో పూతగా పూయాలి.
జిల్లా వ్యాప్తంగా 41661.27 ఎకరాల్లో కొబ్బరి సాగు
కొబ్బరి పంటను ఆశిస్తున్న తెగుళ్లు
ఒకవైపు అడవి పందులు.. మరో వైపు తెగుళ్ల బెడద
ఆందోళనలో రైతులు


