వేస్ట్‌ ఆయిల్‌.. బెస్ట్‌ ఐడియా | - | Sakshi
Sakshi News home page

వేస్ట్‌ ఆయిల్‌.. బెస్ట్‌ ఐడియా

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

కవిటి: ముత్యాలపేటకు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి పాతిన ఉమాశంకర్‌ వినూత్నంగా ఆలోచించాడు. గ్యాస్‌ లేని వారంతా కట్టెల పొయ్యితో అవస్థలు పడుతుంటే.. ఆయన మాత్రం ప్రత్యామ్నాయ గ్యాస్‌ను తయారు చేయడంపై దృష్టి పెట్టాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేసి విజయం సాధించాడు. బుక్‌ చేయడం, ఎదురు చూడడం వంటి అవస్థలతో పని లేకుండా తనే సొంతంగా గ్యాస్‌ తయారు చేస్తూ అబ్బురపరుస్తున్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన గ్యాస్‌ కొరతతో కవిటిలో నిర్వహిస్తున్న రామేశ్వరం కేఫ్‌ కూడా మూతపడింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన చెఫ్‌లకు పోషణ భారంగా మారింది. దీంతో వారిని కొద్ది రోజులు సెలవుపై ఇంటికి వెళ్లి రావాలని పంపించి బాగా ఆలోచించాడు. ఆర్మీలో పనిచేసిన రోజుల్లో తన అనుభవంలో ఉన్న ఆలోచనను వెల్డింగ్‌ వర్క్‌ చేస్తున్న తన మిత్రుడు రాజేష్‌తో పంచుకున్నాడు. ఇద్దరూ తమ అభిప్రాయాల్ని చర్చించుకొని తమకున్న ప్రత్యామ్నాయ ఇంధనంతో గ్యాస్‌ స్టవ్‌ చేసే పనిని చేయగలిగే ఓ పొయ్యిని తయారు చేశారు.

● లారీలు, బస్సులు, ఆటోలు తదితర వాహనాలలో వాడేసి తొలగించిన వేస్ట్‌ ఆయిల్‌తో ఈ పొయ్యి పనిచేసేలా ఓ స్టవ్‌ డిజైన్‌ తయారు చేశారు.

● ఓ ఆయిల్‌టిన్‌ను ట్యాంకర్‌గా మార్చి స్టాండ్‌పై ఎత్తుగా అమర్చారు.

● అందులో 15 లీటర్ల వేస్ట్‌ ఇంజిన్‌ ఆయిల్‌ నింపారు.

● దాని నుంచి స్టవ్‌ బర్నర్‌ వద్దకు ఆయిల్‌ ప్రసరించి దాన్ని నిప్పుతో మండించే ఏర్పాటుచేశారు.

● ఆ స్టవ్‌ బర్నర్‌కు ఓ ఎయిర్‌ బ్లోయర్‌(ఎలక్ట్రిక్‌)సాయంతో నిరంతరం గాలిని అందించేలా ఏర్పాటు చేశారు.

● దీంతో బర్నర్‌ వద్ద గ్యాస్‌ స్టవ్‌ కంటే అత్యధికమైన మంట వెలువడుతోంది.

● ఈ 15 లీటర్ల వేస్ట్‌ ఆయిల్‌తో మూడు రోజుల పాటు రోజుకు రెండుసార్లు లెక్కన 60 కిలోల బిర్యానీ తయారు చేయగలుగుతున్నారు.

● ఇన్‌స్టంట్‌ చికెన్‌ ఐటెం తయారీకి గ్యాస్‌ స్టవ్‌ వాడి వంటకాలు చేస్తున్నారు.

● పెద్ద పరిమాణంలో తయారు చేసే వంటలకు వేస్ట్‌ ఆయిల్‌తో నడిచే స్టవ్‌ను వినియోగిస్తున్నారు.

● గతంలో మూడు రోజులకు ఓ గ్యాస్‌ సిలెండర్‌ వినియోగించే పరిస్థితి ఉండేది. దాని ధర రూ.2200.

● ఈ ప్రయోగం ద్వారా మూడురోజులకు అయ్యే వంటకోసం ఖర్చు రూ.400 మాత్రమే.

● బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేస్ట్‌ ఆయిల్‌ స్టవ్‌తో ఉమాశంకర్‌ చేస్తున్న వ్యాపార ప్రయాణం పలువురికి మార్గదర్శకంగా మారింది.

● ఈ వేస్ట్‌ ఆయిల్‌ స్టవ్‌ను.. విశ్రాంత ఆర్మీ ఉద్యోగి పాతిన ఉమాశంకర్‌ దాన్ని ఎకనామికల్‌ ఫ్రెండ్లీగా కూడా మార్చుకున్నారు.

ఎక్కడో.. ఎవరెవరి మధ్యనో యుద్ధం జరుగుతుంటే.. ఇక్కడ హొటళ్లు మూతపడుతున్నాయి. సిలిండర్లు లేక, ఉన్నవి రాక, వంటలు సాగక చాలా భోజన శాలలకు తాళాలు పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తికి వచ్చిన ఆలోచన ఆ హొటల్‌ను తిరిగి తెరిచింది. వాహనాల వ్యర్థ ఆయిల్‌తో వంట చేయవచ్చనే వినూత్న యోచన వారి బతుకు బండిని మళ్లీ పట్టాలు ఎక్కించింది. విశ్రాంత సైనికుడి ఆలోచనకు ఇప్పుడు అంతా సలామ్‌ కొడుతున్నారు.

వాహనాల నుంచి తీసిన ఇంజిన్‌ ఆయిల్‌ మంటతో వంటలు

గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా వేస్ట్‌ ఆయిల్‌ వినియోగం

గ్యాస్‌ లేక మూతపడిన హోటల్‌ను తిరిగి నడిపిస్తున్న వైనం

విశ్రాంత సైనికుడి ఆలోచనకు సర్వత్రా ప్రశంసలు

ఆర్మీలో పనిచేసేటప్పుడు చూశా..

నేను ఇండియన్‌ ఆర్మీలో సుదీర్ఘకాలం పనిచేశాను. ఇటీవలే ఉద్యోగ విరమణ పొందాను. ఉన్న ఊరిలో ఉండాలనే ఆలోచనతో మరో ఉద్యోగం కోసం ఆలోచించలేదు. రెడీమేడ్స్‌ వస్త్రవ్యాపారం, రామేశ్వరం కేఫ్‌ అనే హోటల్‌ను నడుపుతున్నాను. ఇటీవల వచ్చిన గ్యాస్‌ కొరత.. నా ఉద్యోగ సమయంలో చూ సిన ఈ వేస్ట్‌ ఆయిల్‌ గ్యాస్‌స్టవ్‌ వైపు ఆలోచన చేసేలా చేసింది. నా మిత్రుడు రాజేష్‌తో నా ఆలోచనను పంచుకున్నాను. ఇద్దరి ఆలోచనలు కలిశాయి. నా వ్యాపారానికి ఆటంకం తొలగించింది.

– పాతిన ఉమాశంకర్‌, హోటల్‌ నిర్వాహకుడు, కవిటి

Advertisement
 
Advertisement
Advertisement