● జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ
● జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సమస్యల ప్రస్తావన
శ్రీకాకుళం: ఉద్దానం ప్రాంతంలో తాగునీటి పైపులైన్ల లీకేజీలు లేకుండా అరికట్టాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జెడ్పీ సీఈఓ వెంకటరామన్ లతో కలిసి బుధవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. భూ గర్భ జలాల సమస్య లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఉపాధి హామీలో అందరికీ కార్డులు అందజేయాలని కలెక్టర్ సూచించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల అధికారులు జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కావాలని, ఈ విషయంపై ప్రిన్సిపాల్ సెక్రటరీకి తెలియజేయాలని శాసన సభ్యులు కూన రవి కుమార్, నిమ్మక జయకృష్ణ సూచించారు. సీతంపేట ఐటీడీఏ పీఓతో కలిసి సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
వంగర మండలంలో ఉన్న ఉపాధి హామీ సమస్యలను జెడ్పీటీసీ ఉత్తరావల్లి సురేష్ బెనర్జీ తెలియజేయగా విజయనగరం జిల్లా డ్వామా పీడీకి తెలియజేస్తానని జెడ్పీ సీఈఓ వెంకట్రామన్ తెలిపారు. హిరమండలం నుంచి తాగునీరు ఉద్దానంకు ఇస్తున్నారని, కానీ హిరమండలంలో తాగునీరు పూర్తిస్థాయిలో అందించడం లేదని జెడ్పీ చైర్ పర్సన్ తెలిపా రు. జెడ్పీటీసీ దువ్వాడ వాణి మాట్లాడుతూ టెక్కలిలో తాగునీటి పైపులకు ఉన్న లీకేజీలు అరికట్టాలని కోరగా లీకేజీలు లేకుండా చూస్తామని ఎస్‌ఈ చెప్పారు. సంతబొమ్మాళి మండలంలో తా గునీటి సమస్య గురించి జెడ్పీటీసీ చెప్పగా శాశ్వత పరిష్కారం కింద తాగునీరు ప్రాజెక్టు చేపడుతున్నట్లు ఎస్‌ఈ చెప్పారు. ట్యాంక్‌ల క్లోరినేషన్‌పై జెడ్పీ చైర్‌పర్సన్ అధికారులను నిలదీశారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు మాట్లాడుతూ జేజేఎం ప నులు చేయని కాంట్రాక్టర్లను రద్దు చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ వసతి భవనాల వద్ద పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని జెడ్పీటీసీ దువ్వాడ వాణి చెప్పగా, శ్లాబ్‌లపై రక్షణ గోడలు కొద్దిగా ఎత్తు పెంచాలని ఎమ్మెల్యే కూన రవి కుమార్ చెప్పారు.
దువ్వాడ వాణి వేసిన ప్రశ్నకు సమాధానంగా కలెక్టర్ మాట్లాడుతూ పోర్టు ఉంటే దానికి అనుగుణంగా పరిశ్రమలు రావాలని, అందుకు ప్రభుత్వ భూ ములైతే అది ప్రభుత్వం చూసుకుంటుందని, ప్రైవే టు ల్యాండ్ అయితే భూ సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ జిల్లా సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. పత్రికలో వచ్చిన కథనంపై తాను స్వయంగా వెళ్లి పరిశీలించానని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సీకేడీ మందులు గత 8 నెలలుగా సరఫరా చేయడం లేదని జెడ్పీ చైర్ పర్స న్ పిరియా విజయ తెలిపారు. సోంపేటలో డయా లసిస్ యూనిట్ మరమ్మతులకు గురైందని తక్షణమే మరమ్మతులు చేయాలని సోంపేట జెడ్పీటీసీ కోరారు. కవిటి, సోంపేట, పాతపట్నంలో లో వోల్టేజీ సమస్య ప్రస్తావనకు వచ్చింది.
మాట్లాడుతున్న జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ
మాట్లాడనివ్వకుండా..
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ, జెడ్పీటీసీలను మాట్లాడనివ్వకుండా కూటమి ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆయా ప్రాంతాల్లో సమస్యలను ప్రస్తావిస్తున్నప్పుడు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూన రవికుమార్, ఎన్.ఈశ్వరరావు, గొండు శంకర్‌లు ఏ సమస్య ప్రస్తావించినా అడ్డు తగలడంతో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు


