టెక్కలి రూరల్: సంతబొమ్మాళి మండలం నావాబుపేట గ్రామానికి చెందిన యువతి బుధవారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఇంట్లో వచ్చిన చిన్నపాటి తగాదా కారణంగా మనస్తాపానికి గురై ఫ్యాన్‌కి ఉరివేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు కిందకు దించి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. నౌపడ పోలీసులు వివరాలు సేకరించారు.
ముద్దాయిల ఆరోగ్యంపై దృష్టి
గార: జైలులో విచారణ ఎదుర్కొంటున్న ముద్దాయిల ఆరోగ్య సంరక్షణలో నిర్లక్ష్యం వద్దని, వారికి నాణ్యమైన ఆహారం అందేలా చూడటం అధికారుల బాధ్యతని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. బుధవారం అంపోలు జిల్లా జైలును తనిఖీ చేశారు. బ్యారక్‌లను సందర్శించి ముద్దాయిలతో మాట్లాడారు. కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందుతున్న తీరు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైలులో ఉన్న వ్యక్తులపై ఆధారపడి ఉన్న కుటుంబాలకు అండగా నిలిచే స్పృహ పథకం విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో జిల్లా జైలర్ దివాకర్‌నాయుడు, చీఫ్ ఎల్‌ఏడీసీ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
దైవ చింతనతో మానసిక ప్రశాంతత
నరసన్నపేట: పోలాకి మండలం మబగాం గ్రామస్తుల చిరకాల కోరిక ఉమా మాధవస్వామి(వల్లభనారాయణ స్వామి) ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం నిర్వహించిన పందిరిరాట కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. మే 6 నుంచి 9 వరకూ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ధర్మాన గజలక్ష్మి, పద్మప్రియ, రామ్‌మనోహర్‌నాయుడు, రామలింగన్నాయుడు దంపతులు పాల్గొన్నారు.
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తికి గాయాలు
బూర్జ: పాలకొండ–శ్రీకాకుళం ప్రధాన రహదారిలో లక్కుపురం కూడలి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్.ఎన్.పేట మండలం కొత్త బాలేరు గ్రామానికి చెందిన సవర లింగయ్య గాయపడ్డాడు. లింగయ్య తన స్వగ్రామం నుంచి పాలకొండ వెళుతుండగా శ్రీకాకుళం వైపు వెళుతున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తల, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు స్పందించి 108 అంబులెన్సులో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్‌సీ ఎస్.ఎన్.మూర్తి తెలిపారు.


