షైనింగ్‌ స్టార్‌ అవార్డుకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

షైనింగ్‌ స్టార్‌ అవార్డుకు ఎంపిక

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

పలాస: పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ద్వితీయ ఏడాది హెచ్‌ఈసీ గ్రూప్‌ విద్యార్థిని ఎస్‌.డేనియా ప్రీతి ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచి షైనింగ్‌ స్టార్‌ అవార్డుకు ఎంపికై ంది. 1000 మార్కులకు 975 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడంతో పురస్కారానికి అర్హత సాధించింది. ఈమె స్వగ్రామం నందిగాం మండలం విసంపల్లి. తండ్రి నాగేశ్వరరావు ఉపాధ్యాయుడు, తల్లి జయమ్మ గృహిణి. ఈ సందర్భంగా ప్రీతి మాట్లాడుతూ సివిల్స్‌ సాధించడమే తన లక్ష్యమన్నారు.

పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సూచించారు. ఆయన బుధవారం సాయంత్రం జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ తన కార్యాలయం నుంచి జూమ్‌ ద్వారా నిర్వహించారు. కాలుష్య నియంత్రణ మండలి, లీగల్‌ మెట్రాలజీ విభాగాల్లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులకు ఏప్రిల్‌ నెలాఖరులోగా శంకుస్థాపనలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

రెడ్డి వేదితకు పురస్కారం

హిరమండలం: పరిపాలనతో పాటు ఉత్తమ ప్రజాసేవలు అందించినందుకుగాను సివిల్‌ సర్వీసెస్‌ అధికారి రెడ్డి వేదిత ఢిల్లీ ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకున్నారు. సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ముఖ్యమంత్రి జనసేవా సదన్‌లో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సర్దార్‌ తరంజిత్‌ సింగ్‌ సంధు, సీఎం రేఖాగుప్తా చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. వేదిత తండ్రి దివంగత రెడ్డి నాగభూషణం కూడా సివిల్‌ సర్వీసెస్‌ అధికారిగా సేవలందించారు. తల్లి రెడ్డి శాంతి పాతపట్నం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జితో పాటు పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా వేదితకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement