పశువులు పట్టివేత | - | Sakshi
Sakshi News home page

పశువులు పట్టివేత

Apr 21 2026 6:07 AM | Updated on Apr 21 2026 6:07 AM

రణస్థలం : లావేరు మండలం తాళ్లవలస జాతీయ రహదారిపై సోమవారం ఉదయం మూడు బొలెరో వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 14 పశువులను లావేరు ఎస్సై కె.అప్పలసూరి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పేకాట శిబిరంపై దాడి

జి.సిగడాం: వెలగాడ గ్రామ పరిధిలోని అరటి తోటలో పేకాట ఆడుతున్న 11 మందిని జి.సిగడాం ఎస్సై వి.సందీప్‌కుమార్‌ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.44,850 నగదు, ఫోన్‌ పే ద్వారా రూ.9వేలు, 9 సెల్‌ఫోన్లు, 5 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

పలాస : లక్ష్మీపురం సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ రాము, క్లీనర్‌ శివగణేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108 అంబులెన్సులో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

25న జాబ్‌ మేళా

నరసన్నపేట: నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 25న ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పి.లత ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లమో చేసిన 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల నిరుద్యోగ యువత అర్హులని పేర్కొన్నారు. 25న ఉదయం 9.30 గంటలకు చేరుకోవాలని సూచించారు. 12 కంపెనీల నుంచి హెచ్‌ఆర్‌లు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రైల్వేస్టేషన్‌లో సమస్యలు పరిష్కరించాలి

కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్‌లో సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్‌ డాక్టర్‌ సీపాన గుణవతి కోరారు. సోమవారం స్థానిక రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి, మరుగుదొడ్లు, వెయిటింగ్‌ హాల్‌, తాగునీరు తదితర సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ప్రధాన రైళ్లకు హాల్టింగ్‌ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అడ్వైజర్‌ ఎల్‌.గోవిందరాజులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.జి.ప్రసాద్‌, పిట్ట పోలయ్య, కడియం ప్రసాద్‌, ధనుంజయ, ఈరోతు శ్రీనివాసరావు, బడే రాజేష్‌, డొంక సునీల్‌, పెట్టా రామకృష్ణ పాల్గొన్నారు.

రెండు రోజుల్లో

ఉపాధి బకాయిలు జమ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఉపాధి హామీ పథకం పెండింగ్‌ బకాయిలను రెండు రోజుల్లో వేతనదారుల ఖాతాల్లో జమ చేస్తామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జి.వి.లవరాజు ఒక ప్రకటనలో తెలిపారు. వేతనదారులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిందని, నిధులు కూడా విడుదలయ్యాయని పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని రోజులుగా ఆగిన పేమెంట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలకే జమ చేస్తామని వివరించారు. ప్రతి ఒక్కరికీ పనికి తగిన వేతనం అందుతుందని పీడీ స్పష్టం చేశారు.

పనులు పరిశీలన

హిరమండలం: గొట్టాబ్యారేజీ వద్ద జరుగుతున్న గైడ్‌ బండ్‌ పనులను డీఈ బి.సరస్వతి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గొట్టాబ్యారేజీ ఆధునీకరణ పనులు నిమిత్తం ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందన్నారు. పనులు వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీపడవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏఈలు పరిశుద్దబాబు, ఏఈ ఆనంద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement