టీడీపీ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘ సమావేశం
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం సోమవారం నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ అధికార పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం పట్ల పలువురు తప్పుపడుతున్నారు. కాగా, ఇదే సమావేశంలో సంఘ నాయకులు చేసిన తీర్మానాలు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని అద్దం పట్టేలా ఉండటంతో తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం కాగా ఆ రోజున పార్టీ కార్యాలయంలో ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నట్లుగా తీర్మానాలు చేయడాన్ని తప్పుపట్టడం గమనార్హం.
నరసన్నపేట: నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో సోమవారం నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు ముగింపు కార్యక్రమం విమర్శలకు తావిచ్చింది. పూర్తిగా అధికార కార్యక్రమం అయినా అగ్నిమాపక సిబ్బంది ఆ విషయం మరిచి టీడీపీ నాయకులకు పసుపు కండువాలు వేసి పార్టీ కార్యక్రమంలా నిర్వహించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. పార్టీ నాయకులను ఆహ్వానించడం అలా ఉంచితే పసుపు కండువాలు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి మోహనరావు, నరసన్నపేట అగ్నిమాపక అధికారి వరహాలు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.


