● సీనియర్ ఇంటర్ విద్యార్థులకూ
ఇంప్రూవ్‌మెంట్‌కు చాన్స్
● 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
విద్యార్థులకు గొప్ప అవకాశం..
ఇంటర్ ద్వితీయ సంవత్స రం విద్యార్థులకు సైతం ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం క ల్పించడం గొప్ప అవకాశం. సద్వినియోగం చేసుకోవాలి. ఇంటర్‌బోర్డు తీసుకున్న గొప్ప నిర్ణయం. ఫెయిలైన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 27వ తేదీ వరకు అవకాశం ఉంది. విద్యార్థులు వారు చదువుకున్న కళాశాలల్లో ఇంప్రూవ్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి మొదలవుతాయి. – రేగ సురేష్‌కుమార్, ఇంటర్‌విద్య జిల్లా డీవీఈఓ/ఆర్‌ఐఓ
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్ బోర్డు శుభవార్త అందించింది. ఇంటర్ సెకెండియర్ విద్యార్థులకు సైతం మార్కులు పెంచుకునేందుకుగాను ‘ఇంప్రూవ్‌మెంట్’ కోసం పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తు ఇంటర్‌బోర్డు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 2024లో ఈ విధానం అమల్లోకి రావాల్సి ఉండగా.. ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఎట్టకేలకు ఇంటర్ బోర్డు నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చింది. సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 27వ తేదీలోగా ఫెయి లైన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇంటర్‌బోర్డు జిల్లా అధికారులు సూచిస్తున్నారు.
మే 21వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మొదలుకానున్న విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు ఫస్టియర్‌కు మాత్రమే..
ఇంటర్మీడియెట్ బోర్డు చరిత్రలో ఇప్పటి వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం ఉండేది. ఏటా మార్చి నెలలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించిన పేపర్ల(సబ్జెక్టులు)కు ఇంప్రూవ్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడం, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకై పరీక్ష ఫీజులు చెల్లించి, పరీక్షలకు హాజరుకావడం జరుగుతుండేది. అయితే ఈ ఇంప్రూవ్‌మెంట్ విధానాన్ని ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. మే నెల 21 నుంచి జరిగే ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో సీనియర్ ఇంటర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వులు వెలువరించింది.
ఎక్కువ మార్కులకే ఫిక్స్
ఇంప్రూవ్‌మెంట్‌కు హాజరయ్యే విద్యార్థుల్లో ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలకు ఇంటర్‌బోర్డు చెక్ చెప్పింది. ఎక్కువ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. మార్చిలో జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఏదైనా సబ్జెక్టులో సాధించిన మార్కులు.. ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల్లో సాధించిన మార్కులు.. ఏవి ఎక్కువ మార్కులు అయితే వాటినే ఇంటర్‌బోర్డు పరిగణనలోకి తీసుకోనుంది. అయితే ఇది కేవలం ఫీజులు దండుకునేందుకు వేసిన ఎత్తుగడ అని కొందరు విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
పరీక్షలకు
సన్నద్ధమవుతున్న విద్యార్థులు
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో 164 జూనియర్ కాలేజీలు ఉండగా.. జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 39,838 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 17,385 మంది పరీక్ష రాయగా 12,684 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో కనీసం 3వేల మంది వరకు ఇంప్రూవ్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.


