ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ నడికుదుటి పాలెం గ్రామంలో ఎమ్మెల్యే ఈశ్వరరావుకు చెందిన ఎన్‌ఈఆర్ స్కూల్ వెనక వెంకటరాయణ చెరువుకు వెళ్లే గెడ్డను కప్పేసి చదును చేసిన దృశ్యమిది. ఆక్రమించిందెవరో? ఎక్కడి నుంచి కంకర, మట్టి, గ్రావెల్ తెచ్చి గెడ్డను కప్పేశారో పాలకులే చెప్పాలి. చదును చేసిన గెడ్డను వాహనాల పార్కింగ్ కోసం ఉపయోగిస్తుందెవరో వాళ్లే తెలియజేయాలి.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
ఎచ్చెర్ల నియోజకవర్గంలో అక్రమార్కులు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో చెప్పడానికి వెంకటరాయణ చెరువుకు వెళ్లే గెడ్డే నిలువెత్తు సాక్ష్యం. రణస్థలం మండలంలో జరుగుతున్న అక్రమాలకు ఇదొ క సాక్షిగా నిలిచింది. ఇంతగా బరితెగించెందెవరో, ఆక్రమణకు గురైన గెడ్డ పక్కనే ఉన్న స్కూల్ యజ మాని నడికుదుటి వారే నిగ్గు తేల్చాలి. భారీ ఎత్తున అక్కడికి మట్టి, కంకర, గ్రావెల్ తెచ్చిందెవరో రట్టు చేయాలి. లేదంటే గెడ్డ కనుమరుగైనట్టే.
అడ్డు అదుపూ లేని అక్రమాలు..
రణస్థలం మండలంలో ప్రభుత్వ భూములు ఆక్ర మణకు గురవుతున్నాయి. ఖాళీగా కనిపిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. చెరువులు, వాగులు, కొండలైతే చెప్పనక్కర్లేదు. దర్జాగా ఆక్రమించేసి సొమ్ము చేసుకుంటున్నారు. కొండలకు గుండు కొట్టేసి, కంకర, గ్రావెల్‌ను తమకు కావాల్సిన చోట వేసుకుని లోతట్టు ప్రాంతాలను చదును చేసుకుంటున్నారు. గతంలో ఇదే స్కూల్ ముందు లోతట్టు ప్రాంతాన్ని చదును చేసేందుకు సంచాం కొండ నుంచి గ్రావెల్, కంకరను టిప్పర్ల ద్వారా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గ్రామస్తులు నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్క సంచాం కొండే కాదు రణస్థలంలోని అనేక కొండలతో పాటు నియోజకవర్గంలోని కొండలు దాదాపు కరిగిపోతున్నాయి. కొండలను బోడి కొండలుగా చేసేస్తున్నారు. కాపాడాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. చెప్పాలంటే అక్రమార్కులకు తమవంతుగా మరింత సాయం చేస్తున్నారు.
ఎంత ధైర్యం
చెరువులు, వాగులు, ప్రభుత్వ భూముల ఆక్రమణ ల కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచి ది. నియోజకవర్గం వ్యాప్తంగా ఆక్రమణలు జరుగుతున్నాయి. రణస్థలం మండలం దాంట్లో ముందుంది. ఎన్నో ఆక్రమణలు ఉన్నాయి. దానికో ఉదాహరణ వెంకటరాయణ(దినం మద్యం చెరువు)కు వెళ్లే గెడ్డ ఆక్రమణ. ఎన్‌ఈఆర్ స్కూల్ వెనక 2 ఎకరాలకు పైగా ఉన్న గెడ్డను కప్పేసి, కొండలను తవ్వి తీసిన గ్రావెల్, కంకరతో పాటు చెరువులను తవ్వి తీసిన మట్టిని తీసుకొచ్చి చదును చేసేశారు. తమకు కావాల్సిన విధంగా గెడ్డను కప్పేసి, చిన్న కాలువ మాదిరి తయారు చేసి, ఏకంగా అలైన్‌మెంట్ మార్చేశారు. ఆక్రమణ దారుల దయాదాక్షిణ్యంపైన గెడ్డలో కాస్త ఉంచినట్టు కనబడుతోంది. ఇప్పుడది వాహనాల పార్కింగ్ ప్రదేశంగా మారిపోయింది.
అక్రమార్కులెవరు?
ఎన్‌ఈఆర్ స్కూల్ వెనక గెడ్డను కప్పేసిందెవరు? కప్పేసిన గెడ్డలో కొంత ఉంచి, కాలు వలా అలైన్‌మెంట్ మార్చేసిందెవరు? ఆ గెడ్డను ఆక్రమించి, కప్పేసేందుకు ఎక్కడి నుంచి గ్రావె ల్, కంకర, మట్టి తీసుకొచ్చిందెవరు? ఏ చెరు వును, ఏ కొండను తవ్వేశారు? ఇంత మొత్తంలో మట్టి, గ్రావెల్ ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఆద్యులు, బాధ్యులు ఎవరు? ప్రస్తుతం తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నియోజకవర్గ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు స్కూల్ పక్కనే అంత ధైర్యం చేసిందెవరో నిగ్గు తేల్చాల్సిన ఆవశ్యకత ఉంది. దీనికి ఎమ్మెల్యే చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దొంగలెవరో రూఢీ చేయాలి. లేకపోతే, వెంకటరాయణ చెరువుకు వెళ్లే గెడ్డ భవిష్యత్‌లో పూర్తిగా కనుమరుగైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
రెండెకరాలకు పైగా గెడ్డ పోరంబోకు స్థలం అక్రమంగా చదును
నడికుదుటిపాలెంలో ఆక్రమణ దందా
గెడ్డ పోరంబోకులో కాస్త మినహాయించి కాలువగా అలైన్‌మెంట్ మార్పు
కొండలు, చెరువులను తవ్వి తీసుకొచ్చిన కంకర, గ్రావెల్, మట్టితో గెడ్డను కప్పేసిన వైనం


