ఫీజు రాయితీ అంటూ తాయిలాలు
విద్యార్థులతో ప్రచారం చేయిస్తున్న వైనం
మా దృష్టికి వస్తే చర్యలు
శ్రీకాకుళం: జిల్లాలోని కొన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్మిషన్ల బాధ్యతను టీచర్లకు అప్పగిస్తున్నాయి. కొత్తగా అడ్మిషన్లు చేయిస్తేనే తదుపరి సంవత్సరం ఉద్యోగాల్లో ఉంటారని షరతులు విధిస్తున్నారు. ఈ సారి కొత్తగా విద్యార్థులను కూడా ప్రచారాలకు వాడుకుంటున్నారు. కొత్తగా పిల్లలను చేర్పిస్తే వీరికి ఫీజులో రాయితీలు ఇస్తామని చెబుతుండడంతో వారు వీధివీధీ తిరుగుతున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా వేరొక పాఠశాలలో చదువుతున్నట్లు తెలిసిన ప్రతి ఇంటికి వెళ్లి ప్ర చారాలు చేస్తున్నారు. వేరొకరి ద్వారా పాఠశాలల్లో చేరాలనుకునే వారికి ఫీజును అధికంగా వసూలు చేస్తున్నట్లు భోగట్టా.
ఆ మొత్తాన్ని తాయిలాలుగా పంచుతున్నట్లు సమాచారం. జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపై దృష్టి సారించి ఇలాంటి వాటిని అరికట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇలాంటి విషయాలు ఎవరైనా ఆధారాలతో సహా మా దృష్టికి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వారి గుర్తింపును కూడా రద్దు చేసే అవకాశాలు ఉంటాయి. కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో కూడా ఈ విషయమై తక్షణం మాట్లాడతాను.
– రవిబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి


