తండ్రి కళ్లెదుటే కుమారుడు మృతి | - | Sakshi
Sakshi News home page

తండ్రి కళ్లెదుటే కుమారుడు మృతి

Apr 20 2026 9:41 AM | Updated on Apr 20 2026 9:41 AM

రణస్థలం: రణస్థలం జాతీయ రహదారి మరో విషాదానికి సాక్షిగా నిలిచింది. కళ్ల ముందే కుమారుడు ప్రాణాలు వదిలేస్తే.. నిస్సహాయంగా ఏడుస్తున్న తండ్రి కన్నీటితో ఈ దారి తడిచింది. జేఆర్‌ పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం విశాఖలోని మల్కాపురం నుంచి పంది దీనబంధు, కుమారుడు ప్రేమ్‌కుమార్‌(15) ఆదివారం శ్రీకాకుళానికి బైక్‌పై వచ్చారు. ప్రేమ్‌కుమార్‌ శ్రీకాకుళంలోని డిఫెన్స్‌ ఎంట్రన్స్‌ పరీక్ష రాశాడు. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం వెళుతుండగా రణస్థలం టౌన్‌ వద్దకు రాగానే సాయంత్రం 4గంటల సమయంలో లారీని ఓవర్‌ టేక్‌ చేయబోయి వీరి స్కూటీ అదుపు తప్పింది. దీంతో డ్రైవింగ్‌ చేస్తున్న తండ్రి దీనబంధు రోడ్డు ఒకవైపు తుళ్లిపోగా వెనుక కూర్చుని ఉన్న కొడుకు మాత్రం లారీ టైర్‌ కిందకు వెళ్లిపోయాడు. సరిగ్గా తలభాగం చక్రాల కింద నలిగిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్ల ముందే ఇలా చనిపోవడంతో ఆ తండ్రి ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. జేఆర్‌ పురం పోలీసులు వచ్చి మృతుని వివరాలు సేకరించారు. దీనబంధు విశాఖపట్నంలోని మల్కాపురంలో ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరి స్వస్థలం జిల్లాలోని మెళియాపుట్టి మండలంలోని బురద రామచంద్రాపురం పంచాయతీలో గల శేఖరపురం గ్రామంలోని హరిజన వీధి. ఈయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కొడుకు చనిపోవడంతో గుండెలవిసేలా రోదించారు. ఈ ప్రమాదంపై జేఆర్‌ పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రమాద స్థలంలో రోదిస్తున్న తండ్రి

దీనబంధు

అదుపు తప్పిన స్కూటీ

లారీ చక్రాల కింద పడి చనిపోయిన కుమారుడు

Advertisement
 
Advertisement
Advertisement