● వేసవిలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం
● స్వీయ నియంత్రణతోనే వృథాకు అడ్డుకట్ట
అవగాహన అవసరం
విద్యుత్ వినియోగంపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగిఉండాలి. అవసరం మేరకు మాత్రమే ఉపకరణాలు వాడాలి. స్వీయ నియంత్రణతో వృథా ఖర్చు తగ్గించవచ్చు. విద్యుత్ ఆదా చేసేందుకు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
– జి.ప్రసాద్, విద్యుత్ శాఖ డీఈఈ, పాతపట్నం
●
హిరమండలం: వేసవి కావడంతో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ఏ ఇంట చూసినా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగం పెరుగుతోంది. వీటితో పాటు వాషింగ్‌మిషన్, మిక్సీలు, కుక్కర్లు వంటి ఉపకరణాలు దినచర్యలో భాగమైపోయాయి. ఫలితంగా నెల తిరిగే సరికి విద్యుత్ బిల్లు మోత మోగుతోంది. దాన్ని చూసి బెదిరిపోయే కంటే ముందుగానే విద్యుత్ పొదుపు పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉపకరణాలు వాడకంలో ఆచుతూచి వ్యవహరిస్తే వృథా ఖర్చు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో సుమారు 6.71 లక్షల గృహ వినియోగవసరాల కోసం దాదాపు 80 శాతం విద్యుత్ వినియోగం జరుగుతోంది. రోజుకు సుమారు 60 లక్షల యూనిట్ల వినియోగం జరుగుతోంది. అందులో కేవలం లైట్ల కోసం 20 శాతం వాడుతున్నారు. ఈ విషయంలో కొంచెం పొదుపు పాటిస్తే వృథా ఖర్చు తగ్గుతుంది. సాధారణ బల్బులకు బదులుగా ఎల్‌ఈడీ రకం పెట్టుకుంటే బిల్లు తక్కువ వస్తుంది. పగటిపూట లైట్లు అవసరం లేకుండా కిటికీలకు లేత రంగుల కర్టెన్లు వేస్తే కాంతి లోపలికు వస్తుంది.
పిల్లలకు నేర్పించాలి..
విద్యుత్ వినియోగం ఆదాపై తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలి. సెలవులు కావడంతో అవసరం మేరకు మాత్రమే ఉపకరణాల వాడాలి. బడిలో విరామ సమయాల్లో ఫ్యాన్లు, లైట్లు ఆపివేయాలని చెప్పాలి. ఇంట్లో కంప్యూటర్లు, టీవీలు కొంత సమయమే చూడాలి. ఫోన్, కెమెరాలకు అవసరం మేరకే చార్జింగ్ చేసుకోవాలి. ఫ్రిజ్ డోర్ తరచూ తీయకూడదని వివరించాలి.
ఇలా పాటిస్తే మేలు..
● ఫ్రిజ్, గోడ మధ్య ఖాళీ ఉండేలా చూసుకోవాలి. లేకుంటే కంప్రెసర్ ఎక్కువగా పనిచేసి విద్యుత్ వృథాకు ఆస్కారం కలుగుతుంది.
● కొందరు వాషింగ్ మిషన్‌లో సామర్థ్యానికి మించి దుస్తులు వేస్తారు. అలాచేస్తే యంత్రం పనిచేసే సమయం పెరిగి కరెంట్ వాడకం ఎక్కువ అవుతోంది. టీవీ, కంప్యూటర్లు వాడకపోతే స్విచ్ఛాప్ చేయాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు చార్జింగ్ పూర్తికాగానే ప్లగ్‌ల నుంచి తొలగించాలి.
● ఎక్కువ చల్లదనం కోసం చాలామంది 18 డిగ్రీల వద్ద ఏసీలు వినియోగిస్తుంటారు. అలాకాకుండా ఎప్పుడూ 24 డిగ్రీలలో ఉంచుకుంటే 20 శాతం విద్యుత్ ఆదా చేయగలం. గదిలో తలుపులు, కిటికీలు మూసివేశాకే ఏసీ ఆన్ చేయాలి.
● మైక్రో ఓవెన్‌ను మాటిమాటికీ తీయకూడదు. అలాచేస్తే ఉన్న ఉష్ణోగ్రత తగ్గి తిరిగి వేడెక్కేందుకు మరింత సమయం పడుతుంది. ● ఆటోమెటిక్ ఆన్,ఆఫ్ విదానంతో పాటు 5 నక్షత్రాల ప్రమాణాలున్న ఉపకరణాలు కొనుగోలు చేయడం ఉత్తమం.
గృహ అవసరాలకు బిల్లు ఇలా..
యూనిట్లు చార్జీ(యూనిట్‌కు)
0 – 30 రూ.3.25
31–75 రూ.4.00
76–125 రూ.4.50
126–225 రూ.6.00
226–400 రూ.8.75
400 పైన రూ.9.75


