శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు అన్నారు. ఈ నెల 15న ఒంగోలులో నిర్వహించిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 28వ రాష్ట్ర మహాసభల అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పలిశెట్టి తొలిసారి ఆదివారం శ్రీకాకుళంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారు. విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించకుండా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘సీ్త్ర– శక్తి’ పథకం కారణంగా సిబ్బందిపై పెరుగుతున్న పని భారం, బస్సుల కొరత, సిబ్బంది లోపం వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పథకం అమలులో భాగంగా సిబ్బందికి విధిస్తున్న పనిష్మెంట్లను అడ్డుకునేందుకు యూనియన్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఆయా అంశాలపై ఈ నెలాఖరులో 28వ రాష్ట్ర మహాసభలో స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతాడ వెంకటరావు, విజయనగరం జోన్ జోనల్ కార్యదర్శి బాసూరి కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు కె.దశరథుడు, శ్రీకాకుళం 1–2 డిపో నాయకులు కె.బాబూరావు, జి.త్రినాథ్, ఎస్.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.


