అరసవల్లిలో ‘వైశాఖ’ సందడి | - | Sakshi
Sakshi News home page

అరసవల్లిలో ‘వైశాఖ’ సందడి

Apr 20 2026 9:41 AM | Updated on Apr 20 2026 9:41 AM

అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వైశాఖమాసం తొలి ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, సంప్రదాయక నివేదనలతో అరసవల్లి ఆలయంలో సందడి వాతావరణం కనిపించింది. ఉదయం నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో ఈవో కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండ నుంచి రక్షణ చర్యలు చేపట్టడంతో భక్తులు ప్రశాంతంగా దర్శనాలు చేసుకున్నారు. ఇంద్రపుష్కరిణి అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తుల సంప్రదాయక పూజలకు ఆటంకం కలిగింది. ఘాట్‌ మెట్ల వద్దే మహిళలు పెసల మొలకలు, కొబ్బరి, బెల్లం, చలివిడి, మామిడి పళ్లు తదితర ప్రసాదాలను స్వామికి ప్రసాదాలుగా నివేదించి ప్రత్యేక పూజలు చేసుకున్నారు.పుష్కరిణిలో నీరు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లతో అంతరాలయ దర్శనాన్ని కలిపించి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించేలా ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ చర్యలు చేపట్టారు. కేశఖండన శాలలో భక్తుల నుంచి అదనపు వసూళ్లు చేపడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈవో తనిఖీలు చేపట్టి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్‌ కొరత నేపథ్యంలో అన్నప్రసాదం విషయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. భక్తులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ఉచితంగా మజ్జిగ పంపిణి చేసేలా చలివేంద్రాన్ని ఈఓ ప్రారంభించారు. కార్యక్రమంలో మాన్సాస్‌ సూపరింటెండెంట్‌ నిద్దాన నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement