శ్రీకాకుళం : ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్‌టీయూ నాయకులు విమర్శించారు. ఎస్‌టీయూ జిల్లా శాఖ ప్రథమ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు పేడాడ ప్రభాకరరావు అధ్యక్షతన స్థానిక క్రాంతి భవన్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఉద్యోగ వర్గం తీవ్ర అసంతృప్తికి లోనవుతోందన్నారు.నెలనెలా ఎన్టీఆర్ ఉద్యోగుల ఆరోగ్య పథకం పేరిట జీతాల నుంచి రూ.300 చొప్పున కట్ చేస్తూనే, హెల్త్ కార్డు ద్వారా సరైన వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొనడం అన్యాయమన్నారు. రాష్ట్ర కార్యదర్శి పడాల తమ్మినాయుడు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. బదిలీలు పొందినా రిలీవ్ కాని ఉపాధ్యాయులను ఏప్రిల్ 23లోగా రిలీవ్ చేయాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్‌పై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి పరిష్కారం చూపాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గురువు శ్రీనివాసరావు మాట్లాడుతూ అకడమిక్ ఇన్స్‌ట్రక్టర్లకు వెంటనే గౌరవ వేతనం చెల్లించాలన్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆర్థిక కార్యదర్శి కె.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ వైస్ చైర్మన్ ఎస్.వి.రమణమూర్తి హెచ్చరించారు. సమావేశంలో జిల్లా నాయకులు, ఉపాధ్యాయ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


