వాడీవేడిగా నేర సమీక్ష సమావేశం | - | Sakshi
Sakshi News home page

వాడీవేడిగా నేర సమీక్ష సమావేశం

Apr 19 2026 8:23 AM | Updated on Apr 19 2026 8:23 AM

వాడీవేడిగా నేర సమీక్ష సమావేశం

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నెలవారీ నేర సమీక్ష సమావేశం వాడీవేడిగా సాగింది. ఉదయం 11 గంటలకు మొదలైన సమీక్ష రాత్రి 8 గంటల వరకు సాగడం విశేషం. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ముఖ్యంగా పెండింగ్‌ కేసుల దర్యాప్తులో అలసత్వం, గంజాయి అక్రమ రవాణా, అంతర్రాష్ట్ర ముఠాల చొరబాటు, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల గురించి అధికారులకు కాస్త గట్టిగానే క్లాస్‌ పీకినట్లు సమాచారం. ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి చొరబాటుదారు లు మాల్‌తో అక్రమంగా ప్రవేశించి ఇక్కడి యువతకు విక్రయించడాన్ని అరికట్టలేకపోవడం, ఇటీవలి పాతపట్నం గంజాయి అంశంపై అక్కడి సిబ్బంది సమాచార గోప్యత పాటించకపోవడంపై ఎస్పీ గట్టిగానే మాట్లాడారు. ముఖ్యంగా గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను ట్రేస్‌ చేసి కోర్టులో హాజరుపర్చాలన్నారు. సోంపేట ఎస్‌హెచ్‌ ఓ పరిధిలో అధికంగా పెండింగ్‌ కేసులు ఉండటంపై మాట్లాడారు.

డైనమిక్‌ బీట్‌ సిస్టమ్‌ అమలు..

జిల్లాలోకి గత కొంతకాలంగా అంతర్రాష్ట్ర ముఠాలు చొరబడి భారీ చోరీలు చేసే అంశంపై రాత్రి వేళ డైనమిక్‌ బీట్‌ సిస్టమ్‌ను సమర్థంగా అమలుచేయాలని, బీట్‌లను పునర్‌ వ్యవస్థీకరించి అవసరమైన ప్రాంతాల్లో బీట్‌ సంఖ్యను పెంచాలని ఎస్పీ మాట్లాడారు. నేరాలు జరిగే ప్రాంతాల్లో బీట్‌ సిబ్బంది నిరంతర గస్తీ నిర్వహించాలన్నారు.

సాంకేతికతతో..

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మిస్సింగ్‌ కేసులను వేగవంతంగా ఛేదించాలని, సీసీటీవీ, డేటా ఎనాలసిస్‌ వంటి ఆధునిక పద్ధతులను వినియోగించాలని, వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను డిస్పోజ్‌ చేయాలని, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు ఎక్కువగా కట్టి రోడ్డు ప్రమాదాలు జరగకుండా అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, భవానీ, స్పెషల్‌బ్రాంచి, సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌, లా అండ్‌ ఆర్డర్‌ సీఐలు, ఎస్‌ఐ లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement