శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):
నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24 నుంచి మే 24 వరకు అమ్మవారి పండుగలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించాలని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ మెంటాడ వెంకట పద్మావతి కోరారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావుకు శనివారం వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరసవిల్లి, మండల వీధి, మహలక్ష్మినగర్ కాలనీ, చిన్న మండల వీధి, కుమ్మరి వీధి, రుప్ప వీధి, దుడ్డి వీధి, గురిటిపోలమ్మ అమ్మవారి ప్రాంగణం, స్టేట్ బ్యాంకు కాలనీ, గైనేటి వీధి, పెద్ద బరాటం వీధి ప్రాంతంలో జరగనున్న అమ్మవారి పండుగల సందర్భంగా మౌలిక వసతుల కల్పనకు ఏర్పాట్లు చేయాలని కోరారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ఉదయం, సాయంత్రం ఓ గంట అదనంగా తాగునీరు విడుదల, రోజువారీగా చెత్త తొలగింపు, డ్రైనేజీ పనులు, డయేరియ నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
ఇటీవల దమ్మలవీధి, బలగ ప్రాంతాల్లో నమోదైన అతిసార వ్యాధి పునరావృతం కాకుండా చూడాలన్నారు. శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఆహారం కల్తీకాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. అరసవిల్లి నుంచి పొట్టి శ్రీరాములు జంక్షన్ వరకు డివైడర్స్ తాత్కాలికంగా తొలగిస్తే ప్రజల రాకపోకలు సాఫీగా జరిగే అవకాశం ఉందన్నారు. కమిషనర్‌ని కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి, అలపాన త్రినాథ్ రెడ్డి, బీసీ విభాగం నాయకులు రౌతు సూర్యనారాయణ, జయరాం, శోభన్, గుడికోటి బాల, నగరపు బాబూరావు, రుప్ప లక్ష్మణ, తిరగడి లక్ష్మణ, రషీద్, శ్రీను, జామి ప్రమోద్, ఖలీల్ భాష, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


