మనసును గాయపర్చవద్దు..
పిల్లల్లో సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏది తప్పు, ఏది కరెక్ట్ అని అంచనా వేసుకోలేరు. ముఖ్యంగా పరీక్షల్లో ఫెయిల్ అయిన వెంటనే తల్లిదండ్రులు కోపగించుకుంటారనే భయంతో అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. అలాంటి ప్రమాదాలకు గురి కాకుండా తల్లిదండ్రులే వారికి మనోధైర్యం కల్పించాలి. చిన్న తనం నుంచి ఓటమిని ఎలా ఎదుర్కొనాలి అనే విషయాన్ని వారిలో పదే పదే గుర్తు చేయాలి. దీని వల్ల భవిష్యత్‌లో ఎలాంటి ఓటమినైనా ఎదుర్కొనే శక్తి పిల్లల్లో వికసిస్తుంది.
– నిర్మల్ అలెగ్జాండర్, మానసిక వైద్య నిపుణుడు, జిల్లా ఆస్పత్రి, టెక్కలి.
టెక్కలి:
ఫెయిలయ్యావా..? అయితే ఏం. తలుపు తట్టిన ఓటమి నీకు పాఠం నేర్పిస్తుంది. నేర్చుకుంటే అదే విజయాలకు దారి చూపుతుంది. పురాణాల నుంచి ఇప్పటివరకు చరి త్ర మార్చే విజయాలు సాధించిన వారంతా ఎప్పు డో ఒకప్పుడు ఫెయిలైన వారే. తన ప్రయత్నం వృథా అయిందని థామస్ ఆల్వా ఎడిసిన్ ఆత్మహత్య చేసుకుని ఉంటే మనకు బల్బు వాడే భాగ్యం ఉండేది కాదు. ఫెయిల్ అయిన ప్రతిసారీ ఆయన కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎంట్రన్స్‌లో ఓటమి చెందిన అబ్దుల్ కలాం ప్రపంచం మెచ్చిన గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం బిల్‌గేట్స్ ఎన్నో ఓటములు చవి చూసిన తర్వాత చివరగా మైక్రోసాఫ్ట్‌ను రూపొందించారు. ఏమో ఇప్పుడు ఇంటర్ ఫెయిలైన విద్యార్థి రేపు పట్టుదలతో చదివి సివిల్స్ సాధించవచ్చేమో. ఎవరికి తెలుసు. తక్కువ మార్కులు తెచ్చుకున్న వారే తన కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తారేమో.. చెప్పలేం కదా. కాలం ఇచ్చే బహుమతి అందుకోవాలంటే.. ఇలాంటి పరీక్షలకు తట్టుకుని నిలబడాలని పెద్దలు చెబుతుంటారు.
అఘాయిత్యం వద్దు..
ప్రస్తుతం వివిధ రకాల పరీక్షల ఫలితాల నేపథ్యంలో పరీక్షల్లో తప్పామని, తల్లిదండ్రులు కోపగించుకుంటారనే భయంతో ఎంతో మంది విద్యార్థులు నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించేస్తున్నారు. ర్యాంకులే జీవితాలను శాసిస్తాయనే భ్రమలో బతికేస్తున్నారు. ఎంతో మంది చదువు లేకపోయినా గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు ఉన్నారు. పరీక్షల్లో తప్పితే పిల్లల పై ఎలాంటి కోప, తాపాలు లేకుండా వారిలో మనోధైర్యం కల్పించాల్సింది తల్లిదండ్రులేనని నిపుణులు సూచిస్తున్నారు. జీవితంలో ఎలా గెలవాలి అనే దానిపై వారికి ధైర్యం కల్పించాలని హితవు పలుకుతున్నారు.
మనసు బాగోలేదా..
పరీక్షల్లో తప్పి మనసు బాగోలేకపోతే.. బాధ చెప్పుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆత్మహత్యలకు ప్రేరేపించే వేళ కొన్ని రకాల మానసిక సిబ్బందితో నేరుగా ఫోన్‌లో సమస్యలను చెప్పుకోవచ్చు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం టెలీమానస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెంట్స్ అండ్ నెట్ వర్కింగ్ అక్రాస్ స్టేట్ పేరుతో 14416, 18008914416 ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. ఆయా నంబర్లకు ఫోన్ చేసి ఆత్మహత్యకు ప్రేరేపించే సమస్యలను విన్నవిస్తే, వారు ఆ ప్రమాదం నుంచి ఎలా బయట పడాలి అనే దానిని వివరిస్తారు. ఈ విషయంలో వివరాలు గోప్యంగా ఉంచుతారు.
చరిత్ర మెచ్చిన విజయాలు సాధించిన వారంతా ఓటమి చవి చూసిన వారే
పరీక్షల్లో ఓటమితో దిగులు అనవసరం
మళ్లీ గెలుపుపై దృష్టి పెట్టడమే విజేతల లక్షణం
మనసు బాగోకపోతే మార్గాలున్నాయ్
ర్యాంకులే కాదు.. జీవితం ముఖ్యం
పరీక్షల్లో ర్యాంకులే కాదు.. విజయం సాధించడానికి జీవితం ముఖ్యం. ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఎన్నో రకాల ఒడిదొడుకులను ఎదుర్కొని ప్రపంచ మేధావులుగా ఎదుగుతున్నారు. పిల్లలను అతి గారాబం చేసే చర్యల వల్ల కొన్ని సందర్భాల్లో ఓటమిని తట్టుకోలేరు. విజయానికి ఓటమి, గెలుపు రెండూ అవసరమని వారిలో ధైర్యం కల్పించాలి.
– వీవీ నాగేశ్వరరావు, డైరెక్టర్, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల, టెక్కలి


