అత్యుత్సాహానికి ఫలితం
కంపెనీలో తనకు తిరుగులేదన్న ధోరణితో ఉద్యోగి ఉండేవాడు. నియోజకవర్గ నేత తన వాడని అహంకారం చూపించేవాడు. ఇటీవల యూబీ బీర్ల కంపెనీలో జరిగిన ఆడిట్‌లో ఇతగాడి ప్రమేయం ఉన్న పలు అవకతవకలు బయటపడ్డాయి. నేత ఉన్నాడు కదా.. తనకేమీ కాదని అనుకున్నాడు. కానీ ఉన్నత స్థాయి అధికారులు మాత్రం క్షమించలేదు. నేరుగా కంపెనీకి వచ్చి ఆ ఉద్యోగిని గేటు వద్దకు పిలిపించి కంపెనీకి సంబంధించి ఆయన దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకొచ్చి బయటికి పంపించేశారు. నేత ఏదో కాపాడుతారనుకుంటే బూమరాంగ్ అయిందని, ఇతగాడిపై వేటుతో మిగతా తొత్తులు కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొందని కంపెనీలోనే కాదు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
అతడు ఓ ఉద్యోగి. జీతం తీసుకుంటున్న సంస్థ కోసం పని చేయడం అతడి విధి. వేతనం ఇస్తున్న యాజమాన్యానికి విధేయుడిగా ఉండడం అతడి కర్తవ్యం. కానీ అతడు ఓ నాయకుడి ప్రాపకాన్ని సంపాదించి అత్యుత్సాహం ప్రదర్శించాడు. జీతం ఇస్తున్న కంపెనీని ఆ నాయకుడికి దాసోహం చేయడానికి అన్ని విధాలుగా సహకరించాడు. అక్రమాలు బట్ట బయలు కావడంతో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆఖరుకు ఆ నాయకుడు కూడా కాపాడలేకపోయాడు.
ఎచ్చెర్ల నియోజకవర్గ కీలక నేతకు, యూబీ బీర్ల కంపెనీ అధికారులకు మొదట్లో పడేది కాదు. చాలా వ్యవహారాలు పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లాయి. అయితే మధ్యలో ఏం జరిగిందో గానీ యూబీ బీర్ల కంపెనీ అధికారులు ఆ నేత దారికొచ్చారు. ఆ నేత చెప్పినట్టే ఆడుతున్నారు. ఉద్యోగుల్లో ఎవరిని ఉంచాలో.. ఎవరిని తీసేయాలో నిర్ణయించే స్థాయికి సదరు నేత వెళ్లిపోయాడు. దీంతో ఒకరిద్దరు ఉద్యోగులు అత్యుత్సాహం చూపించడం మొదలు పెట్టారు. కంపెనీలో చేయాల్సిన కార్యకలాపాలను కీలక నేత ఇంటి వద్దనే ఉండి చేస్తూ ఉండేవాడు. పలు లావాదేవీల్లో రూ. కోట్లలో లబ్ధి చేకూర్చారు. కానీ ఒక రోజు ఆ ఉద్యోగి బాగోతం బయటపడింది. ఆడిట్‌లో అవకతవకలు వెలుగు చూశాయి. ఇంకేముంది ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే ఆయన్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించారు. కాపాడతారనుకున్న కీలక నేత ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడిది ఎచ్చెర్ల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
యూబీ బీర్ల కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఎచ్చెర్ల నియోజకవర్గ నేతకు దాసోహమైపోయాడు. కంపెనీలో ఉండి పనిచేయాల్సిన ఆ ఉద్యోగి ఆ నేత ఇంటి వద్ద ఉండి లబ్ధి చేకూర్చాడు. ఏ రకంగా వెళ్తే భారీగా డబ్బులు దోచుకునే అవకాశం ఉందో సలహా ఇచ్చి, దగ్గర ఉండి కాగల కార్యాన్ని పూర్తి చేసేవాడు. యూబీ బీర్ల కంపెనీ నుంచి బీర్ల రవాణా కోసం ట్రాన్స్‌పోర్ట్ టెండర్ల నుంచి ఉద్యోగాల కల్పన వరకు చేతివాటం ప్రదర్శించాడు. సాధారణంగా ఇతర ప్రాంతాలకు బీర్ల రవాణాకు ట్రాన్స్‌పోర్ట్ లారీలకు టెండర్లు పిలిచి, రవాణా బాధ్యత అప్పగిస్తారు. ఈ క్రమంలో ఏ రూట్‌కు ఎంత అనేది నిర్ణయించుకుని, ఆశావహులు టెండర్లు వేస్తారు. కానీ, ఇక్కడ ఇతర పోటీదారుల రాకుండా ముందుగానే వారిని బెదిరించడం, ఎన్ని చేసినా కొందరికి దక్కే కాంట్రాక్ట్‌ను బెదిరించి లాక్కోవడం వంటి ఘటనలు కీలక నేత ప్రమేయంతో జరిగాయి. తనను కాదని ఎవరైనా లారీలు తిప్పడానికి ప్రయత్నిస్తే కదలనివ్వకుండా అడ్డుకోవడం, రోజుల తరబడి అక్కడే ఉండిపోయేలా అడ్డంకులు సృష్టించడం వంటివి జరిగాయి. ఈ బాధ భరించలేక పోటీలో టెండర్లు దక్కించుకున్న ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు కూడా కీలక నేతకు తలొగ్గారు. ఇలా అంతా తానై బీర్ల కంపెనీలో ఆ నేత చక్రం తిప్పుతున్నాడు. ఇక, ఆయనకు ఎదురు లేదని ఒక ఉద్యోగి అత్యుత్సా హం ప్రదర్శించాడు. నేత చెప్పిందల్లా చేయడమే కాకుండా అడ్డగోలుగా ఎలా సంపాదించాలో సల హా ఇచ్చి ఆ పని చేయించేవాడు. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్ట్ ధరలు పెంచి పెట్టడం, లోకల్ మెయింటెనెన్స్ వర్క్‌ల పేరుతో అవకతవకలకు పాల్పడటం, ఉద్యోగాల కల్పన పేరుతో చేతివాటం ప్రదర్శించడం వంటివి చేసేవాడు.
యూబీ బీర్ల కంపెనీలో జరిగిన ఘటనపై ఎచ్చెర్ల నియోజకవర్గంలో చర్చ
నియోజకవర్గ నేతకు జీహుజూర్ అంటూ పనిచేసిన ఉద్యోగి
అక్రమాలు వెలుగు చూడడంతో ఉద్యోగం నుంచి తొలగింపు
కాపాడలేకపోయిన నాయకుడు


