పొలాలు తీసుకుంటే ఉద్యమిస్తాం
● ఓటుబ్యాంకుగా వాడుకున్నది చంద్రబాబే
● పోర్టుల ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలి
● మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు డిమాండ్
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మత్స్యకారులను ఓటుబ్యాంకుగా వాడుకుని వదిలేయడం తప్ప ఒక్క పోర్టు నిర్మాణానికై నా శ్రీకారం చుట్టారా అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్య కారులు, తీర ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే... నారా లోకేష్ ఇంకా పాత పద్ధతిలో అక్క, చెల్లి, చిన్నాన్న, గొడ్డలి అంటూ ఎద్దేవా చేయడం దారుణమన్నారు. ఆయన శుక్రవారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారం చేపట్టాక మంగిడిపూడి బీచ్‌లో బీచ్ ఫెస్టివల్ చేసుకోవటం తప్ప ఇంకేమైనా చేశారా అని ప్రశ్నించారు. జీఓ నంబర్ 217ను ఆనం రామనారాయణరెడ్డి లాంటి పెత్తందారుల నుంచి రిజర్వాయర్లను కాపాడి మత్స్యకా రులకు మేలు చేయడానికి తెచ్చారన్నారు. మంత్రి నారా లోకేష్‌కి కొల్లు రవీంద్ర బినామీ అని రాష్ట్రంలో అందరూ అంటున్నారని తెలిపారు. జువ్వలదిన్నెలో కనీసం తట్టెడు మట్టిగాని ఒక్క ఇటుకై నా వెయ్యకుండా టీడీపీ నాయకులు అబద్ధాలు మాట్లాడడం సరికాదన్నారు. వైఎస్ జగన్ అక్కడ పనులన్నీ పూర్తి చేశాకే టీడీపీ వచ్చిందన్నారు. ఇప్పుడు దాన్ని ప్రైవేటుకు అప్పగించడం దారుణమన్నారు.
జువ్వలదిన్నె హార్బర్ 800 మీటర్ల బెర్త్‌లో 11250 బోట్లు పార్కింగ్‌కి సరిపోద్దని, బోట్లు పెరిగితే అది సరిపోదన్నారు. అందులో 25ఎకరాల భూమిని 40 శాతం బెర్త్‌ని సాగర్ డిఫెన్స్ వాళ్లకు కేటాయించారని, మిగతాది మత్స్యకారులకు వాడుకోండని అంటున్నారని, నిజంగా అది రక్షణ శాఖదైతే మత్స్యకారులకు అందులోకి అనుమతించరు కదా అని ప్రశ్నించారు. కావాలంటే వారికి మరోచోట ఇచ్చుకోవచ్చని వివరించారు. నారా లోకేష్‌కు చేతనైతే హార్బర్ పూర్తి చేసి మేం పూర్తి చేస్తున్నామని చెప్పుకోండి తప్ప ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తామంటే మత్స్యకారుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న బోట్లు మాయం అయిపోతే పోలీసులు చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు.
భావనపాడులో పోర్టు నిర్మిస్తామని టీడీపీ నేతలు ఏళ్ల తరబడి తాత్సారం చేసి కాలం గడిపేశారే తప్ప ఒక్క అడుగు ముందుకు వెయ్యలేకపోయారని, చేయాలన్న సంకల్పం ఉంటే సాధ్యపడుతుందని అది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసి చూపించారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం ఇవ్వటానికి వేల కోట్లు ఖర్చుచేయాలని, అందులో కోట్లాది రూపాయిలు కమీషన్లు కొట్టేయవచ్చన్న అచ్చెన్న, రామ్మోహన్‌నాయుడుల ఆలోచనలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెక్ పెట్టిందన్నారు. పోర్టు నిర్మాణం పూర్తయితే దానికి అనుబంధంగా పరిశ్రమల స్థాపనకు అందుబాటులో 10వేలు ఎకరాలు సాల్ట్ ల్యాండ్స్ ఉన్నాయని, వాటిని చక్కగా వాడుకోవచ్చని అన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఒక్క లేఖ రాస్తే పదివేల ఎకరాల భూమి పైసా ఖర్చులేకుండా పరిశ్రమలకు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఆ దిశగా ఆలోచన చేసి పోర్టుకి అనుసంధానంగా పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలన్నారు. పచ్చగా పంటలు పండుతున్న భూములు తీసుకుని స్థానికులకు ఇబ్బంది పెట్టి జనాగ్రహానికి గురికావద్దని అన్నారు.


