● అరసవల్లి రథసప్తమి వీవీఐపీ పాసుల కేసులో ఆరుగురే నిందితులని తేల్చేసిన పోలీసులు
● నిందితులకు 41–ఏ నోటీసులు
● తప్పించుకున్న రాజకీయ నేతల అనుచరులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు
శ్రీకాకుళం క్రైమ్: అరసవల్లి వీవీఐపీ పాసుల నకిలీ వ్యవహారాన్ని పోలీసులు ఓ ‘కొలిక్కి’ తెచ్చారు. దాదాపు 3 నెలలు.. 3 దర్యాప్తు విభాగాలు, 100 మంది వద్ద స్టేట్‌మెంట్ల రికార్డు, 50 మందికి పైగా విచారణ, 13 మంది అనుమానితులు.. 9 మందిపై ఓ అంచనా వేసి చివరకు ఆరుగురే నిందితులని తేల్చేశారు. ఈ ఏడాది జనవరి 26న జిల్లాకేంద్రంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణుని సన్నిధిలో జరిగిన రథసప్తమి వేడుకలకు సంబంధించి నకిలీ వీవీఐపీ పాసులు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆరుగురే నిందితులని పోలీసులు తేల్చేశారు. వీరిలో నగరానికి చెందిన మణికంఠ జిరాక్స్ అండ్ ప్రింటర్స్ ప్రతినిధులు ఇప్పిలి మణికంఠ, ఇప్పిలి కొండలరావు, ఇప్పిలి సంతోష్‌లే కాక నిజం శ్రీను, నిజం రాజులు ఉన్నారని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రోగ్రాంకు సంబంధించి నకిలీ వీవీఐపీ పాసులకు సంబంధించి అరుణోదయ ప్రింటర్స్ ప్రతినిధి హరిప్రసాద్ ఉన్నట్లు శ్రీకాకుళం రూరల్ సీఐ కె.పైడపునాయుడు వెల్లడించారు. సరైన ఆధారాలు దొరక్కపోవడంతో మిగతా వారి ప్రమేయం లేన ట్లు ప్రస్తుతానికి నిర్ధారించామని, నిందితులను విచారించి 41–ఏ నోటీసులిచ్చి పంపించేసినట్లు ఆయన చెప్పారు. అయితే తెరవెనుక సూత్రధారులను వదిలేశారన్న విమర్శలు నగరంలో గుప్పుమంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
నిందితులను విచారించి..
శుక్రవారం ఉదయమే నిందితులను పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. దాదాపు 2 గంటల పాటు విచారించారు. అయితే దర్శనానికి సంబంధించి వీవీఐపీ నకిలీ పాసులు మణికంఠ జిరాక్స్ నుంచి ముద్రితమయ్యాయని, శ్రీను, రాజులు వారి నుంచి తీసుకున్నారని, తమన్‌షో ప్రోగ్రాంకు సంబంధించి నకిలీ పాసులు అరుణోదయ ప్రింటర్స్‌లో పనిచేస్తు న్న హరిప్రసాద్ ముద్రించారని సీఐ వెల్లడించారు. అనంతరం పలు సెక్షన్ల కింద ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి 41–ఏ నోటీసులిచ్చి పంపించేశామని సీఐ వెల్లడించారు.
ప్రాధాన్యత లేనిదిగా..
ఒకనొక దశలో పాలకవర్గానికి, పోలీసులకు అగ్గిరాజేసేటంత స్థితికి తీసుకెళ్లిన ఈ కేసులో చివరికి భక్తుల తరఫున నిలబడిన పోలీసులు రాజకీయ నాయకులకు తలొగ్గి ప్రతిష్టాత్మక కేసును కాస్తా ప్రాధాన్యత లేని కేసుగా పరిగణించే స్థితికి వచ్చారు. సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు 13 మంది అనుమానితులను, దాదాపు 10 వేల నుంచి 20 వేల వరకు నకిలీ పాసులు గుర్తించారు. వారిలో ప్రధానంగా సోషల్ మీడి యా ఇన్‌ఫ్లూయెన్సర్లు, కొంతమంది పత్రి కావిలేకర్లు, రాజకీయ నేతల అనుచరులు, కుటుంబీకు లు, రెవెన్యూ, దేవాదాయ విభాగాల్లోని వారిని సైతం విచారణ పేరుతో పలు మార్లు స్టేషన్‌కు పిలిపించారు. కానీ ఏ మాయ జరిగిందో గానీ కేసును ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు మళ్లించడం, తర్వాత దర్యాప్తు మొదలుపెట్టడం.. చకచకా జరిగిపోయాయి. దాదాపు 3 నెలల త ర్వాత ఈ ప్రతిష్టాత్మక కేసును కాస్తా ప్రాధాన్యత లేని కేసుగా మార్చి ఎస్‌ఐ హరికృష్ణతో ఎఫ్‌ఐ ఆర్ నమోదు చేయించి మమ అనిపించేశారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కేసులో భక్తులు ఓడి నేతలు గెలిచారా.. భక్తుల తరపున నిలబడి పోలీసులు చతికిలపడ్డారా అన్నది ఆ ప్రత్యక్ష భగవానుడికే ఎరుక.


