జనగణనపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

జనగణనపై అవగాహన అవసరం

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జనగణనపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌, జిల్లా ముఖ్య జనగణన అధికారి స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపునిచ్చారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు, ఉద్యోగులతో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీయ గణన ఏప్రిల్‌ 16 నుంచి 30 వరకు ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల కుటుంబాలన్నీ మొబైల్‌ యాప్‌ ద్వారా స్వీయగణన నమోదు చేసుకోవాలని, ఇతరులకూ అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతిఒక్కరూ వెబ్‌సైట్‌ https://se.census.gov.in లోకి వెళ్లి జనగణన నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 4291 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌లను గుర్తించగా హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌ల సృష్టి ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందన్నారు. జిల్లాలో 3813 ఎన్యూమరేటర్లు, 624 సూపర్‌ వైజర్లను నియమించామని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

రేపు రాష్ట్రస్థాయి

హోమియో సెమినార్‌

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని హోటల్‌ బ్లూఎర్త్‌లో ఈ నెల 19న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ ఫిజీషియన్స్‌ (ఐఐహెచ్‌పీ) ఏపీ స్టేట్‌ బ్రాంచ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ ముఖ్య ప్రతినిధులు డాక్టర్‌ ఎ.వివేకానంద, డాక్టర్‌ అనిల్‌కుమార్‌, డాక్టర్‌ ఎ.వి.షణ్ముఖరాజు, కన్వీనర్లు డాక్టర్‌ ఎస్‌.రవి కుమార్‌, డాక్టర్‌ ఎన్‌.దాసు శుక్రవారం తెలిపా రు. ఉదయం 8 గంటల నుంచి జరగనున్న ఈ సెమినార్‌కు దేశంలోని నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన సీనియర్‌ హోమియోపతిక్‌ వైద్యులు హాజరై వైద్యవిధానంలో నూతన మార్పులు, సరికొత్త చికిత్సా విధానాలపై ప్రసంగించనున్నారని చెప్పారు. ఐఐహెచ్‌పీ జాతీయ, రాష్ట్రశాఖల ముఖ్య ప్రతినిధులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి జిల్లాలోని హోమియో డాక్టర్లు, వైద్యవృత్తిని ఎంచుకున్నవారు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల నిరసన

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ , ఔట్‌సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికులకు మార్చి జీతాలు ఇప్పటికీ జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర మున్సిపల్‌ యూనియన్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు అన్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. అనంతరం కమిషనర్‌ హనుమంతు కూర్మారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 16, 17, 18న రాజమహేంద్రవరం జరిగిన రాష్ట్ర మహాసభల్లో పలు తీర్మానాలు చేశామన్నారు. పారిశుద్ధ్య, ఇంజినీరింగ్‌ కార్మికులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, హైకోర్టు తీర్పు మేరకు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, బకాయి వేతనాలు విడుదల చేయాలని కోరారు. కార్మికులకు పని పరికరాలు అందించి పనిభారం తగ్గించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌, మున్సిపల్‌ నాయకులు ఎన్‌.పార్థసారథి, జె.గురుమూర్తి, ఆర్‌.గణేష్‌, అర్జి పెద్దమణి, దశుమంతుల రమణ, సీతమ్మ, సూర్యకళ, కె.తిరుమలరావు,రామచంద్ర, గౌతం రాజు పాల్గొన్నారు. వీరికి వెల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు కె.సంతోష్‌ మద్దతు తెలిపారు.

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

శ్రీకాకుళం రూరల్‌: సింగుపురం గ్రామానికి చెందిన బెవరా చిట్టిబాబు(34) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సింగుపురం బీసీ హాస్టల్లో అటెండర్‌గా పనిచేస్తున్న చిట్టిబాబు ఇటీవలే గ్రామంలో ఇల్లు నిర్మించాడు. అప్పులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం ఉరివేసుకున్నారు. ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు. భార్య గాయత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement