పాతపట్నం: భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారి యాత్రా మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 19 నుంచి 27 వరకు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి 51వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఆలయ చైర్మన్ అక్కందర సన్యాసిరావు, ఈఓ టి.వాసుదేవరావులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉత్సవాలు ఇలా..
● ఈ నెల 19న వర్ధినీ కలశస్థాపన, విఘ్నేశ్వర పూజ, దేవ పుణ్యాహవచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, అఖండ దీపస్థాపనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 20న కుంకుమార్చన, రద్ర హోమాలు, మహారాజ భోగాలు, 21న అష్టోత్తర శతనామార్చనలు, మూలమంత్ర, మంటపస్త దేవతా హోమాలు, 22న లలితా త్రిశతి నామార్చనలు, శ్రీ సూక్త, దుర్గా సూక్త హోమాలు, 23న లక్ష్మీనారాయణ హోమాలు, 24న రుద్ర హోమాలు, 25న వర్థనీ కలశోద్వాసనాలు, అపబంబృంద స్నానం, 26న త్రిశత నామకుంకుమార్చనలు, వర్ధని పూజలు, 27న బలిహరణ, మహా పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
● 20న సాయంత్రం 6 గంటల నుంచి బొమ్మిక గ్రామస్తుల భజన, 21న సాయంత్రం 5.30 గంటల నుంచి సామూహిక కుంకుమార్చనలు, 22న రాత్రి 8 గంటలకు నరసన్నపేట చంద్రమౌళి బుర్రకథ, 23న సాయంత్రం 6 గంటలకు హిమగిరి మాస్టారు ఆధ్వర్యంలో భరతనాట్యం, కూచిపూడి నత్యప్రదర్శన, 25, 26, 27వ తేదీల్లో ప్రతీ రోజు సాయంత్రం 4 గంటలకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు, 27న సంగిడీ, ఉలవ బస్తా పోటీలు జరుగుతాయి.
అమ్మవారి మహోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్య లు తీసుకుంటు న్నాం. ఆలయానికి రెండు రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. – అక్కందర సన్యాసిరావు,
చైర్మన్, నీలమణిదుర్గ ఆలయం, పాతపట్నం
19 నుంచి పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారి యాత్రా మహోత్సవాలు
తొమ్మిది రోజుల పాటు ఉత్సవాల నిర్వహణ
ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు


