అమరావతి పేరిట భారీ భూదోపిడీ | - | Sakshi
Sakshi News home page

అమరావతి పేరిట భారీ భూదోపిడీ

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

వైఎస్సార్‌ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌

ఆమదాలవలస: అమరావతిని రాజధానిగా చేస్తే రాష్ట్రానికి గుదిబండగా మారి ప్రజలకు శాపంగా మారే ప్రమాదం ఉందని వైఎస్సార్‌ సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌లాంటి నగరం నిర్మిస్తామంటూ ప్రజల భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన అనుచరులు భారీ స్థాయిలో అవినీతి, భూదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ప్రధాన నగరాలు అభివృద్ధి చెందడానికి శతాబ్దాల సమయం పట్టిందని, ఒక నగరం రూపుదిద్దుకోవడానికి 400 నుంచి 500 ఏళ్లు పడుతుందని గుర్తుచేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌, ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌ వంటి కొత్త రాజధానుల్లో జనాభా తక్కువగా ఉండటానికి ఉపాధి అవకాశాల కొరతే కారణమని పేర్కొన్నారు. మయన్మార్‌లో నిర్మించిన నగరం ప్రజలు లేక ‘ఘోస్ట్‌ సిటీ’గా మారిందని ఉదహరించారు. శివరామకృష్ణ కమిటీ అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని పేర్కొందని గుర్తు చేశారు.

రాజధాని పేరిట రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతోందని, కొద్దిమంది చేతుల్లోనే భూములు కేంద్రీకృతమవుతున్నాయన్నారు. అమరావతి నిర్మాణాలకు ఆ ప్రాంత రైతులకు కేవలం 30 శాతం భూమి ఇచ్చి మిగతా భూమిని కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి కీలక చెల్లింపులు నిలిచిపోయిన పరిస్థితుల్లో రూ.లక్షల కోట్లు అమరావతిపై ఖర్చు చేయడం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిపాదించిన వికేంద్రీకరణ విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మావిగన్‌ ఆలోచన చాలా బాగుందని మేధావులు సైతం చెబుతున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement