● బంగారం చోరీల కేసుల్లో ముద్దాయి అరెస్టు
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ లక్ష్మణరావు
టెక్కలి రూరల్ : చెల్లి పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చలేకపోవడం, సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాలోచన రావడంతో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. శుక్రవారం టెక్కలి జగతిమెట్ట ఫ్లై ఓవర్ వద్ద ఓ వ్యక్తి బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గుర్తించి ఆపారు. బండి రికార్డులు లేకపోవడంతో వ్యక్తిని అదుపులో తీసుకుని విచారించగా పలు చోరీ కేసులో ముద్దాయిగా ఉన్న మందస మండలం భిన్నళ మదనాపురం గ్రామానికి చెందిన కొమ్మాన ఢిల్లీరావు(దిలీప్‌కుమార్)గా గుర్తించారు. ఇతనిపై మూడు కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఈ నెల 6న టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న రమణి జ్యూయలరీ షాపులోకి ఢిల్లీరావు ప్రవేశించి యజమాని కళ్లుగప్పి బంగారు గొలుసు, రెండు ఉంగరాలు చోరీ చేసి పరారయ్యాడు. 2025 మేలో కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలో జ్యూయలరీ షాపులోకి మాస్క్ ధరించి వెళ్లి రెండు బంగారు గొలుసులు, ఉంగరం, జత చెవి బుట్టలతో పరారయ్యడు. ఈ ఏడాది మార్చిలో కాశీబుగ్గ ఓ టిఫిన్ షాపు ముందు పార్కింగ్ చేసి ఉన్న స్కూటీని మారుతాళంతో తెరిచి పరారయ్యాడు. ఈ మూడు కేసులకు సంబంధించి 45 గ్రాముల బంగారు ఆభరణాలు, ద్విచక్రవాహనం, మొబైల్ ఫోన్ స్వాదీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు చెప్పారు. ఢిల్లీరావు విశాఖపట్నంలోని ఓ హోటల్లో పనిచేసేవాడని, చెల్లి పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక, సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో టెక్కలి సీఐ విజయ్‌కుమార్, ఎస్‌ఐ రాము, సిబ్బంది పాల్గొన్నారు.


