కవిటి: స్థానిక చింతామణి భారత్ గ్యాస్ గ్రామీణ వితరక్ కేంద్రం వద్దకు సిలిండర్ బుక్ చేసుకోవడానికి వెళ్లిన మహిళలు, వృద్ధులకు గ్యాస్ కంపెనీ యాజమాన్య ప్రతినిధులు, సిబ్బంది పరుషపదజాలంతో అవహేళన చేయడం పట్ల శుక్రవారం గొండ్యాలపుట్టుగ గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వినియోగదారుల సమస్యలు పట్టించుకోకుండా బయట గంటకుపైగా నిరీక్షింపజేసి యాజమాన్య సిబ్బంది ఫోన్‌లో మాట్లాడుకోవడం పట్ల అసంతృప్తికి గురయ్యారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే అందజేస్తామని, లేకుంటే ఇవ్వబోమని తెగేసి చెప్పారని, ఈ విషయంలో దిక్కున్నచోట చెప్పుకోవాలని అగౌరవంగా మాట్లాడారని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆర్‌ఎస్‌డీటీ పి.నిరంజన్‌కు ఫిర్యాదు చేశారు. ఏజెన్సీలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. కాగా, ఇదే అంశంపై తమపైన దాడి చేశారని, సమగ్రవిచారణ జరిపి న్యాయం చేయాలని గ్యాస్ ఏజెన్సీ యాజమాన్య ప్రతినిధులు కవిటి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


