ప్రైవేట్ ట్రావెల్స్‌పై కొరడా!
● అదనపు చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
● ఆర్‌టీజీఎస్ యాప్‌తో పర్యవేక్షణ
● ఈ నెల 18 వరకు తనిఖీలు
● ‘సాక్షి’తో జిల్లా ఉపరవాణా శాఖాధికారి విజయసారధి
శ్రీకాకుళం రూరల్: సంక్రాంతి పండగ సందర్భంగా ప్రైవేట్ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఉపరవాణాశాఖాధికారి ఎ.విజయసారధి హెచ్చరించారు. అధిక చార్జీలు వసూలు చేయకుండా రవాణాశాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టిందన్నారు. ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
యాప్‌తో నిరంతర పర్యవేక్షణ..
గత ఐదురోజులుగా ఆర్‌టీజీఎస్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఫేర్ మోనటరింగ్ టీమ్స్ ద్వారా అన్ని ప్రైవేట్ బస్సుల ఆన్‌లైన్ బుకింగ్‌ను పర్యవేక్షిస్తున్నట్లు విజయసారధి చెప్పారు. అభిబస్, రెడ్‌బస్, తదితర యాప్‌ల ద్వారా ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న బస్ చార్జీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
నిబంధనలు మీరితే చర్యలు..
బస్సుల్లో నిర్ణీత చార్జీలే వసూలు చేయాలి. ఈ విషయమై ఫిర్యాదులు వచ్చిన వెంటే సంబందిత ప్రైవేట్ బస్సు యాజమాన్యంతో అధికారులు సమన్వయం చేసి చార్జీలను తక్షణమే తగ్గించి నియంత్రించే చర్యలకు పూనుకుంటున్నారు.
హెల్ప్‌లైన్ ఏర్పాటు..
ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల హెల్ప్‌లైన్ 9281607001 నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బస్సులతో పాటు ప్రయాణికుల సమస్యలను పరిష్కరించే దిశగా ఈ నంబర్ పనిచేస్తుందన్నారు. ఈ నంబర్‌ను ప్రతి బస్సులోనూ స్పష్టంగా ప్రచురించాలని బస్సు యజమానులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
తనిఖీలు కొనసాగిస్తాం..
సంక్రాంతి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనెల 18 వరకూ సిబ్బంది అన్ని ప్రైవేట్ బస్సుల్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తారు. అదనంగా చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు. జనవరి 9 నుంచి 13 వరకూ జరిగిన తనిఖీల్లో ఇప్పటివరకూ 21 కేసుల్లో రూ.46,400 అపరాధ రుసుం వసూలు చేశాం. పర్మిట్‌లు, ట్యాక్సులు కట్టని బస్సులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – విజయసారధి, డీటీసీ
ప్రైవేట్ ట్రావెల్స్‌పై కొరడా!
ప్రైవేట్ ట్రావెల్స్‌పై కొరడా!


