ఘనంగా ఆదిత్యుని కల్యాణం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవం బుధవారం ఉదయం అనివెట్టి మండపంలో ఘనంగా నిర్వహించారు. పుష్య బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉషా పద్మిని ఛాయా దేవేరులతో సూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను కల్యాణమూర్తులుగా అలంకరించి ప్రక్రియ పూర్తి చేశారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్‌శర్మ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించి భక్తదంపతులకు తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, వేదపండితులు పాల్గొన్నారు.
నేడు ఆదిత్యుని క్షీరాభిషేకం
మకర సంక్రాంతి సందర్భంగా సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టుకు పంచామృతాలతో అభిషేక సేవ జరగనుందని ఈవో ప్రసాద్ తెలిపారు. గురువారం ఉదయం 4 గంటల నుంచి అభిషేక సేవ జరుగుతుందని, నిజరూపదర్శనం కూడా ఉంటుందని, రూ.500 టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తదంపతులకు మాత్రమే ఈ సేవలో పాల్గొనే అవకాశముందని చెప్పారు.
ఆదిత్యుని సన్నిధిలో భక్తుల రద్దీ
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. బుధవారం భోగి సందర్భంగా ఆదిత్యుని ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో స్వామివారిని ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేసి ఉదయం 6 గంటల నుంచే సర్వదర్శనాలకు అనుమతిచ్చారు. విశాఖకు చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ వై.ప్రభాకరరావు కుటుంబసమేతంగా ఆదిత్యున్ని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సాంప్రదాయం ప్రకారం గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించి తీర్ధప్రసాదాలను అందజేశారు. అనంతరం సూర్యనమస్కారాల పూజలు నిర్వహించారు. ఇదిలావుంటే రథసప్తమి మహోత్సవాల సందర్భంగా ఆలయ మండపాల్లో వివిధ రకాల పనులు జరుగుతున్న క్రమంలో ఎక్కడా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ తగు జాగ్రత్తలతో కూడిన చర్యలు చేపట్టారు.


