ఒక్క పైసా ఇవ్వకుండా..
గత ఏడాది మూడు రోజుల రథసప్తమి వేడుకలకు ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయలేదు. రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ జీఓ ఇచ్చి చేతులు దులుపుకుంది. కార్పొరేషన్ నిధులతో గత ఏడాది హడావుడి చేసింది. రాజకీయంగా మైలేజ్ పొందడానికి ప్రయత్నించింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. ఈ సారి వారం రోజుల ఉత్సవాలకు అనుమతి ఇచ్చింది. కానీ, ఒక్క పైసా విడుదల చేస్తున్నట్టు ప్రకటించలేదు. దీంతో మళ్లీ కార్పొరేషన్ నిధులపైన, నగరంలోని దాతలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాకుండా లోటు బడ్జెట్ ఉన్న కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టి గొప్పలు చెప్పుకోవాలని నేతలంతా చూస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ నాయకులకు బాగానే ఉన్నా అధికారులకు ఇబ్బందికరంగా మారింది. ఇలాగైతే కష్టమని అన్నందుకు ఏకంగా కమిషనర్‌పై బదిలీ వేటు వేసినట్టు చర్చ జరుగుతోంది. రథసప్తమి వేడుకలకు ముందు నగరంలో అనుభవం ఉన్న అధికారి ఉండాలి. అలాంటిది మరో 15 రోజుల ఉత్సవాలు ఉండగా బదిలీ జరిగిందంటే రాజకీయంగా మాట వినడం లేదన్న కారణమై ఉండవచ్చనే వాదనలు విన్పిస్తున్నాయి.
మరోవైపు మున్సిపల్ ఇంజినీర్
(ఎం.ఈ) శ్రీనివాసరావు రథసప్తమి పనులు, స్థానిక నాయకుల ఒత్తిడి తట్టుకోలేక సెలవుపై వెళ్లిపోయారు. తిరిగి విధుల్లో చేరుతారో లేదో అన్న అనుమానాలు వ్య క్తం అవుతున్నాయి. ఇంజినీరింగ్ విభాగంలోనే డీఈగా ఉన్న కమలాకర్ ప్రస్తుతం ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు.


