ఊరెళ్తున్నారా.. ఊడ్చేస్తారు..!
జాగ్రత్తలు తప్పనిసరి
బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలి
● సంక్రాంతి సమయంలో దొంగల బెడద ● ఊరెళ్తే పోలీసులకు సమాచారమివ్వండి ● ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో మీ ఇల్లు సురక్షితం ● జిల్లావ్యాప్తంగా 119 పోలీసు బీట్లతో నిఘా
శ్రీకాకుళం క్రైమ్/ఇచ్ఛాపురం రూరల్:
సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు చాలామంది ఊళ్లకు వెళ్తుంటారు. ఈనెల 10 నుంచి 18వ తేదీ వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. విధులు, ఉపాధి నిమిత్తం పట్టణాల్లో ఉండేవారు వారివారి ఇళ్లకు తాళాలు వేసి సొంత గ్రామాలకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఇదే అదునుగా దొంగలు ఇళ్లల్లో చొరబడే ప్రమాదముంది. అందువలన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హితవు పలుకుతున్నారు. రెండేళ్లుగా చూసుకుంటే జిల్లాను గజ దొంగలు హడలెత్తించారు. భారీ చోరీలతో విరుచుకుపడ్డారు. ఏకంగా 800పైగా ప్రాపర్టీ నేరాలు చేశారంటే ఏ స్థాయిలో రెచ్చిపోయారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తాళాలు వేసిన ఇళ్లల్లోనే ఎక్కువ చోరీలు జరిగాయి. అందువలన క్యాంపులకు వెళ్లేవారు పోలీసులకు ముందస్తుగా సమాచారమిచ్చి ఎల్‌హెచ్‌ఎంఎస్ సేవలు వినియోగించుకుంటే, ఇల్లు మరింత సురక్షితంగా ఉంటుందని పోలీసులు అంటున్నారు. జిల్లావ్యాప్తంగా 119కు పైగా నైట్‌బీట్ బృందాలతో పాటు డివిజనల్ స్థాయి అధికారులు, సీఐలు, ఎస్‌ఐలనే కాకుండా ప్రత్యేక కార్య, నేర బృందాలను, పెట్రోలింగ్ పార్టీలను సైతం జిల్లా ఉన్నతాధికారి అలెర్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
స్వగ్రామాలకు, క్యాంపులకు వెళ్లేముందు ఇంటికి తాళాలు వేసేటప్పుడు పక్కింటివారికి సమాచార మిచ్చి కాస్తా ఇల్లు చూడమని చెప్పాలి.
ఎక్కువ రోజులు బయటకు వెళ్తే సమాచారా న్ని దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు గానీ, సచివాలయ పోలీసులకు గానీ తెలియపర్చాలి. ఎల్‌హెచ్‌ఎంఎస్ ద్వారా వీరికి భద్రత కల్పి స్తారు.
ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అపార్ట్‌మెంట్స్ ఇన్‌గేట్, ఔట్‌గేట్‌ల వద్దే కాకుండా బయట కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. వాచ్‌మెన్ తప్పనిసరి.
అపరిచిత వ్యక్తులు తారసపడితే 100కు గానీ, 112కు గానీ డయల్ చేసి పోలీసులకు తెలియజేయాలి.
మంచినీళ్ల కోసం, సాయం కోసం వచ్చేవారు అనుమానాస్పదంగా ఉంటే తలుపులు తీయ కుండానే మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయాలి.
ఆటోల్లో, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు విలువైన బంగారం, నగదు బ్యాగుల్లో భద్రపరిచి గమనిస్తుండాలి. ముఖ్యంగా వృద్ధులు, ఒంటరి మహిళలు ప్రయాణించేటప్పుడు నగలు ఏమీ ధరించకుండా, బ్యాగుల్లో పట్టుకోకుండా జాగ్రత్తపడాలి.
షాపింగ్ చేసేటప్పుడు ప్రజలు తమ బ్యాగు లు, పర్సులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. జేబు దొంగలుంటారు. ద్విచక్ర వాహనాలకు, కార్లకు హ్యాండ్ లాక్ వేసుకోవాలి.
దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఆభరణాలు, నగదు, విలువైన డాక్యుమెంట్స్ బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలి. వెళ్లేముందు పోలీసులకు చెప్పి ఎల్‌హెచ్‌ఎంఎస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సీసీ కెమెరాలు అమర్చి ఇంటి యజమాని మొబైల్‌కు, పోలీస్ కంట్రోల్ రూమ్‌కు జీపీఎస్ ద్వారా అనుసంధానం చేస్తాం. పరిసరాల్లో పోలీస్ బీట్ పెడతాం. ఇప్పటికే సబ్ డివిజన్ పరిధిలో 45 పోలీస్ బీట్లు పెట్టాం. స్పెషల్ పెట్రోలింగ్ పార్టీలు తిరుగుతాయి. ఎస్పీ ఆదేశాలతో అవసరం మేరకు మరిన్ని పెంచుతాం. నగరంలో షాపింగ్ మాల్స్, ఇతర దుకాణ సముదాయాల వారు బయట సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టుకోవాలి.
– సీహెచ్ వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం
ఊరెళ్తున్నారా.. ఊడ్చేస్తారు..!
ఊరెళ్తున్నారా.. ఊడ్చేస్తారు..!
ఊరెళ్తున్నారా.. ఊడ్చేస్తారు..!
ఊరెళ్తున్నారా.. ఊడ్చేస్తారు..!


