ఎరువులు దుకాణాల తనిఖీ
జి.సిగడాం: రబీ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా లక్షా 53 వేల ఎకరాల్లో మొక్కజొన్న, రాగి, వరి, ఇతర పంటలను సాగు చేస్తున్నారని, వీటి కావాల్సిన యూరియా రైతులకు అందుబాటులో ఉంచామని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కోరాడ త్రినాథస్వామి వెల్లడించారు. శుక్రవారం ఆనందపురం, పాలఖండ్యాం, జి.సిగడాం గ్రామాల్లో ఎరువుల షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 13,963 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందజేశామన్నారు. ఖరీఫ్ సీజన్‌లో లక్ష్యానికి మించి వరి పంటలో దిగుబడులు సాధించినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలులో దళారులు లేకుండా నేరుగా ప్రభుత్వమే రైతు కొనుగోలు చేస్తుందన్నారు. ఈ–క్రాప్ నమోదు వచ్చే నెల 15లోగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈయనతోపాటు మండల వ్యవసాయాధికారి బెండి బాబ్జీ, రైతుసేవా కేంద్రం అసిస్టెంట్ ముంతా హరీష్, తూలుగు అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


