రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నాని
రణస్థలం: వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కంది సురేంద్రనాథ్ (నాని)ని పార్టీ రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ప్రకటన వెలువడింది.
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట
శ్రీకాకుళం రూరల్: బైరి ఇసుక ర్యాంపుపై శుక్రవారం రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. వంశధార నదిలో అనధికారికంగా సాగుతున్న ఇసుక రవాణాను అడ్డుకున్నారు. ర్యాంపు నడిచే ప్రాంతాల్లో ఎక్కడికక్కడ గట్లకు అడ్డుకట్ట వేస్తూ స్ట్రెంచ్ కొట్టించారు.
సైనిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు
సారవకోట : మండల కేంద్రం సారవకోటకు చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్ పారశెల్లి ధర్మేంద్రబాబు(53) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం ఆయన మృతదేహానికి పాతపట్నంలో పోస్టుమార్టం నిర్వహించగా స్థానిక యువకులు ద్విచక్ర వాహనాలతో గ్రామంలో ర్యాలీగా తీసుకొచ్చారు. కుర్ధాకు చెందిన 110 బెటాలియన్ బీఎస్‌ఎఫ్ సైనికులు ఎస్‌ఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ధర్మేంద్రబాబు డిసెంబర్ 28న సెలవుపై వచ్చారు. ప్రస్తుతం 18 బెటాలియన్ నార్త్ బెంగాల్‌లో విధులు నిర్వర్తించారు. ఈయనకు భార్య దేవి, కుమారుడు ఉన్నాడు.
పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి సాయం
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సతివాడ హిమశేఖర్‌కు అంబేద్కర్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ చైర్మన్ కొండ్రు జగదీశ్వరరావు రూ.20 వేలు ఆర్థిక సాయం శుక్రవారం అందజేశారు. శ్రీకాకుళం గూనపాలెంకు చెందిన హిమశేఖర్ ఈజిప్ట్ దేశం కై రో నగరం వేదికగా ఈ నెల 13 నుంచి 18 వరకు జరగనున్న పారా వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్–2025–26 పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా జగదీశ్వరరావు మాట్లాడుతూ నిరుపేద క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంపిలి ప్రేమ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
డ్రోన్ పిచికారీ పరిశీలన
పాతపట్నం: రైతులకు ఉపయోగపడేలా సేద్యంలో ప్రయోగాలు చేయాలని ట్రైనీ ఐఏఎస్ అధికారి పృథ్వీరాజ్ అన్నారు. శుక్రవారం సీది, తామర గ్రామాల్లో పంట నమోదును పరిశీలించారు. రైతు కాగతాపల్లి వెంకటరావు మొక్కజొన్న పంటకు డ్రోన్‌తో మందు పిచికారీ చేయడంపై ఆరా తీశారు. ఆయనతో పాటు తహసీల్దార్ ఎన్.ప్రసాదరావు, వ్యవసాయాధికారి కె.సింహాచలం, ఏఎస్‌వో బాలరాజు, రైతులు పాల్గొన్నారు.
పేకాట శిబిరంపై దాడి
రణస్థలం: తెప్పలవలస పంచాయతీ సీతారాంపురం సమీపంలోని తోటల్లో పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఏడుగురిని అదుపులోనికి తీసుకుని పోలీసులకు అప్పగించారు. వీరి వద్ద నుంచి ఏడు సెల్‌ఫోన్లు, రూ.1,95,960 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నాని
రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నాని
రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నాని
రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నాని


