స్మార్ట్ పోలీసింగ్‌తో కేసులు ఛేదించాలి
శ్రీకాకుళం క్రైమ్ : కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత స్మార్ట్ పోలీసింగ్ ఎంతో కీలకమని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సాంకేతిక అప్లికేషన్ల వినియోగం, కేసుల పురోగతి, ఆన్‌లైన్ పోర్టల్స్‌లో సమాచారం నమోదు విధి విధానాలను వివరించారు. నాట్‌గ్రిడ్ ద్వారా డేటా విశ్లేషణ, సీసీటీఎన్‌ఎస్‌లో ఎఫ్‌ఐఆర్ నుంచి చార్జిషీట్ వరకు సమాచారాన్ని సకాలంలో నమోదదు చేసి, క్రైమ్ మాక్ ద్వారా అంతరజిల్లా – రాష్ట్ర నేరగాళ్ల గుర్తింపు, ఈ–సాక్ష్య ద్వారా డిజిటల్ ఆధారాలు భద్రపరిచే విధానం తప్పనిసరిగా అమలుచేయాలన్నారు. సమన్లను ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ ద్వారా పంపి ఖర్చు ఆదా చేయడంతో పాటు పారదర్శకత పెంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 కాల్స్‌కు తక్షణంగా స్పందించాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు కె.వి.రమణ, పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, షేక్ షాహబాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


