సచివాలయ ఉద్యోగులను ఒత్తిడికి గురిచేయొద్దు
ఆమదాలవలస : రకరకాల సర్వేల పేరుతో పూర్తిస్థాయి సమాచారం, అవగాహన కల్పించకుండానే సచివాలయ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం, మరోవైపు బీఎల్‌ఓ విధులను అప్పగించడం తగదని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ, జీడబ్ల్యూఎస్‌ఈఎఫ్ సంఘం ఉత్తరాంధ్ర కన్వీనర్ కూన వెంకట సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆమదాలవలసలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సర్వే పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలు చూపిస్తూ పలు రిపోర్టుల పేరుతో తీవ్ర పని ఒత్తిడి కల్పించడం అన్యాయమన్నారు. ఈ ఒత్తిడి కారణంగా డిసెంబర్‌లోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 మంది సచివాలయ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారి కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సచివాలయ ఉద్యోగుల పనితీరును తప్పుబట్టడం సమంజసం కాదన్నారు. ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావలసిన నోషనల్ ఇంక్రిమెంట్లు, స్పెషల్ ఇంక్రిమెంట్లు, కరువు భత్యం, వేతన సవరణ కమిటీ ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ చానల్ కల్పించి, ఖాళీగా ఉన్న వివిధ ప్రభుత్వ విభాగాల్లో భర్తీ చేయాలని కోరారు.


