బొడ్డపాడులో అమరవీరుల వారోత్సవాలు
పలాస: మండలంలోని బొడ్డపాడులో అమరవీరుల వారోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సమాజ మార్పుకు కోసం తమ ప్రాణాలను బలిదానం చేసిన అమరులు వేగు చుక్కలై వెలుగొందుతారని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం, గోదావరి లోయ ప్రతిఘటనా పోరాటంలో అమరులైన వీరులను తలుచుకొని నివాళులర్పించారు. అనంతరం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. శ్రీకాకుళం ఉద్యమంలో అమరులైనవారిని ఆదర్శంగా తీసుకొని నేడు అనేక పోరాటాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం జిల్లా నాయకుడు గొరకల బాలకృష్ణ, ఇప్టూ జిల్లా కన్వీనర్ జుత్తు వీరాస్వామి, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు బదకల ఈశ్వరమ్మ, కార్యదర్శి ఎస్.కృష్ణవేణి, జగన్, వంకల పాపయ్య, ఎం.వినోద్ తదితరులు పాల్గొన్నారు.


